పత్తిలో కొత్త వంగడం(గోసిపియం హిర్సుటం) వచ్చింది. సాధారణ పత్తి అయితే నాలుగైదు సార్లు ఏరాల్సి వస్తుండగా ఇది మాత్రం ఒకేసారి కాత వచ్చి రైతులకు ఖర్చు బాధ తప్పిస్తుంది. అంతేకాదు తక్కువ వ్యవధిలో పంట చేతికి రావడమే గాక యంత్రాలతో సులువుగా కోసే అవకాశముంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ అనుమతితో సదరు విత్తన కంపెనీ జనగామ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో ప్రయోగాత్మకంగా 1500 ఎకరాల్లో సాగుచేయాలని నిర్ణయించింది. ఈమేరకు అధికారులు ఈ సరికొత్త పత్తి సాగుకోసం పలు గ్రామాల్లోని భూముల్లో దుక్కి దున్నిస్తుండగా, రైతుల్లో ఆసక్తి పెంచుతోంది.
– లింగాలఘనపురం, మే 26
“అన్నా.. నేను పత్తి వేశాను. ఒక్క మూడో దఫాలో ఏరిన పంటే కాస్త ఓ మోస్తరుగా వచ్చింది. మొదటి విడుత ఏరిన పంట కూలీలకే సరిపోయింది. చివరి పంటను కూలీలనే ఏరుకొమ్మని చెప్పి తోచినంత ఇయ్యిమన్న. అటు వానలు సరిగ పడక.. ఇటు కూలీల దొర్కక ఆగమైతాన” ఇవి ఇప్పటివరకు పత్తి రైతులు చెప్పుకున్న కష్టాలు, అనుభవాలు. ఇక నుంచి ఈ ఇబ్బందులు తీరనున్నాయి. పత్తిలో కొత్త వంగడంతో పండిన పంటనంతా ఒకేసారి ఇళ్లకు పత్తి రైతులు తీసుకెళ్లేలా ఈ విత్తనాలను రూపొందించారు. శాస్త్రజ్ఞులు చొరవ తీసుకుని పత్తిలో కొత్త వంగడాన్ని సృష్టించారు. దఫాలుగా కాకుండా వరి పంటలా ఒకేసారి దిగుబడి చేతికొచ్చేలా ఈ వంగడాన్ని రూపొందించారు. కూలీల అవసరం లేకుండా యంత్రాలతో ఈ పంటను ఇంటికి ఒకేసారి తీసుకెళ్లవచ్చు. శాస్త్రజ్ఞులు ఈ విత్తనానికి గోసిపియం హిర్సుటం(GOSSYPIUM HIRSUTUM)పేరిట శాస్త్రీయంగా నామకరణం చేశారు. వ్యవసాయశాఖ, ప్రైవేట్ విత్తన సంస్థ(రాశి) సంయుక్తంగా ఈ తొలకరి నుంచి జిల్లాలో 1500 ఎకరాల్లో రైతులతో ప్రయోగాత్మకంగా ఈ విత్తనాన్ని వేయించనుంది. ఈ క్రమంలో లింగాలఘనపురం మండలంలో 200 ఎకరాల్లో ఈ పంట సాగుచేయనున్నారు.

రైతుకు తప్పనున్న ఇబ్బందులు
రైతులు తొలకరితో వర్షాధార పంటగా పత్తి వేస్తారు. దుక్కులను దున్ని సాళ్ల నడుమ 120 సెంటీమీటర్లు, మొక్కల మధ్యన 60 సెంటీమీటర్ల నిడివి ఉండేలా అచ్చులు తోలుతూ విత్తనాలు వేస్తారు. విత్తిన 50 రోజులకు పంట పూత దశకు చేరుకుని 60 నుంచి 70 రోజుల్లో పత్తి మొదటి దశ ఏరుతారు. ఇలా ఆరు నెలల వ్యవధిలో 4నుంచి 5 సార్లు ఏరాల్సి ఉంటుంది. రైతులంతా ఒకే పర్యాయం పత్తి వేయడం ఒకేసారి ఏరేందుకు కూలీల అవసరం ఉంటుంది. మొదటి దశలో ఏరిన పంట కూలీలకే సరిపోతోందని పలువురు రైతులు ప్రతిసారి చెబుతుంటారు. చివర్లో ఏరే పంటనైతే చాలామంది రైతులు కూలీలకే అప్పజెప్పి వారు ఇచ్చింది తీసుకోవడం పత్తి రైతులకు ఆనవాయితీగా మారింది. ఎరువులు క్రిమిసంహారక మందుకు సైతం అధిక సంఖ్యలో మందులు వాడుతుంటారు. పంటను ఏరిన ప్రతిసారి చేనుకు ఎరువులు వేయాల్సి ఉంటుంది.

తీరనున్న కోత కష్టాలు..
కొత్త వంగడంతో రైతులకు ఇబ్బందులు తొలగనున్నాయి. దీని కాలపరిమితి 150 రోజులు కాగా, పంట దిగుబడి ఒకే పర్యాయం రావడం విశేషం. ఈ పంటలో సాళ్లకు మధ్యన 90 సెంటీమీటర్ల దూరం, మొక్కకూ మొక్కకూ మధ్యన 90 సెంటీమీటర్ల నిడివి తో విత్తనాలు వేస్తారు. పంట 150 రోజుల్లోనే వస్తుండడంతో పాటు గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశముండదు. ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి రానుండడంతో పాటు యంత్రాలతో పంట కోస్తారు. దీని వల్ల కూలీల సమస్య తలెత్తదు. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో రైతులు అధిక దిగుబడి పొందవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో వ్యవసాయశాఖ, ప్రైవేట్ విత్తన సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆదేశాలతో సమన్వయంతో ప్రయోగాత్మకంగా 1500 ఎకరాల్లో ఈ విత్తనాలను రైతులతో వేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు, విత్తన సంస్థ బాధ్యులు గ్రామాల్లోకి వెళ్లి రైతులను సమావేశపరచి ఈ విత్తనంపై అవగాహన కలిగిస్తున్నారు.
తక్కువ కాలం, ఖర్చుతో ఎక్కువ లాభం..
కొత్తరకం పత్తి వల్ల పత్తి రైతుకు ఎంతో లాభం చేకూరుతుంది. ప్రస్తుత పత్తి 6 నుంచి 7నెలల వ్యవధిలో 5 నుంచి 6 సార్లు ఏరాల్సి ఉంటుంది. కొత్త వంగడంతో పంట 150 రోజుల్లో ఒకేసారి దిగుబడి వస్తుంది. దీని వల్ల రైతుకు 30 నుంచి 40 శాతం లాభం చేకూరనుంది. కూలీలకే క్వింటాల్‌కు రూ.వెయ్యి నుంచి 1500 ఖర్చు అవుతుంది. ఆ బెడద తప్పనుంది. అంతేగాకుండా గులాబీ రంగు పురుగు పుట్టకముందే పంట దిగుబడి చేతికొస్తుంది. మండలంలో ప్రయోగాత్మకంగా 200 ఎకరాల్లో ఈ పంటను వేయిస్తున్నాం.
– వెంకటేశ్వర్లు, ఏవో, లింగాలఘనపురం