వర్ధన్నపేట, మే 15 : ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు బూటకపు మాటలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, వామపక్ష కార్యకర్తలు 50 మంది ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే టీఆర్ఎస్ కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజారంజక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై బురద జల్లేందుకు కాంగ్రెస్, బీజేపీ జాతీయస్థాయి నేతలు తెలంగాణకు వస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించాలన్నారు. రాహుల్‌గాంధీ, అమిత్‌షా సభలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
మండలంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఆదివారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. జడ్పీటీసీ మార్గం భిక్షపతి, దమ్మన్నపేట సర్పంచ్ అర్జుల మంగ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లోకి : ఎమ్మెల్యే పెద్ది
చెన్నారావుపేట : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం చెన్నారావుపేట మండలం బోజేర్వు, పుల్లాయబోడు ఎంపీటీసీ భూక్యా మౌనికతో పాటు 30 కుటుంబాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తినాయక్, ఎంపీపీ బానోత్ విజేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్న, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ ఎంపీపీ జక్క అశోక్, బోజేర్వు సర్పంచ్ పిండి విజయ, పుల్లాయబోడు సర్పంచ్ సమ్మునాయక్ తదితరులు పాల్గొన్నారు.