గీసుగొండ, మే 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నందున అనేక భారీ పరిశ్రమలు తెలంగాణ బాట పడుతున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ఈనెల 7న మంత్రి కేటీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే చల్లా అధికారులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి టెక్స్టైల్ పార్కును సందర్శించారు. కేరళకు చెందిన కైటెక్స్ పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన 180 ఎకరాలు, ఉత్తర కొరియా యంగ్వన్ పరిశ్రమలకు కేటాయించిన 263ఎకరాలను పరిశీలించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న గణేశ ఈకోపేట్, గణేశ ఈకోటెక్ పరిశ్రమలను పరిశీలించారు. ఆయా కంపెనీ ప్రతినిధులతో ఏర్పాట్లపై మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కైటెక్స్ గార్మెంట్స్ పరిశ్రమ, యంగ్వన్ వస్త్ర పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారని, గణేశ ఈకోపేట్, గణేశ ఈకోటెక్ చిప్స్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారని వివరించారు.
ఈ నాలుగు నాలుగు పరిశ్రమలకు ప్రభుత్వం 545 ఎకరాలు కేటాయించిందని తెలిపారు. 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న చలివాగు ప్రాజెక్టు నుంచి టెక్స్టైల్ పార్కు వరకు నీటి సరఫరా కోసం వంద కోట్లతో నిర్మించే పైపులైన్ పనులను ప్రారంభిస్తారని చెప్పారు. కైటెక్స్ గార్మెంట్స్ పరిశ్రమలో నేరుగా 8వేల మంది మహిళలకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సూరత్, బీమండి ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు తిరిగి వస్తున్నరని, వారికి ప్రభుత్వం 40 శాతం రాయితీలను కల్పిస్తూ పరిశ్రమలు పెట్టుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో మహేందర్‌జీ, టీఎస్ఐఐసీ జోనల్ మేనేర్ రతన్‌రాథోడ్, తహసీల్దార్ సుహాసినీ, గణేశ ఈ కోటెక్, ఈకో పేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్కండేల్వల్, జనరల్ మేనేజర్ యష్ శర్మ, మేనేజర్ కేఎస్ రెడ్డి, కైటెక్స్ పరిశ్రమ ప్రతినిధులు మనోజ్, రాజు, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజుకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, ఎంపీటీసీ వీరరావు, సొసైటీ చైర్మన్ వీరస్వామి, సర్పంచులు బాబు, గోనె మల్లారెడ్డి, నాయకులు నరహరి, చంద్రమౌళి, ముంతరాజయ్య, రఘ, సంపత్ పాల్గొన్నారు.