హనుమకొండ, మే 2 : యువత ఉద్యోగాల కలను సాకారం చేసేందుకు జంబో రిక్రూట్మెంట్కు శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు, గ్రూప్- 1, పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోనే తొలిసారాగి గ్రూప్ -1కు సంబంధించి భారీగా 503 పోస్టులు భర్తీ చేస్తున్నది. గ్రూప్ -1కు సంబంధించి దరఖాస్తులకు ఈ నెల 31 ఆఖరు తేదీకాగా సోమవారం నుంచే ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రిపేర్ అవుతున్నారు. శిక్షణ కేంద్రాలకు పరుగులు పెడుతూనే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో అభ్యర్థులు ఆత్మ విశ్వాసమే ఆయుధంగా ప్రణాళికాబద్ధంగా చదివితే కొలువు తప్పకుండా సాధించవచ్చని గ్రూప్ -1 అధికారులు సూచిస్తున్నారు. ఫోన్లు పక్కకుపెట్టి పుస్తకాల్లో నిమగ్నమైతే ఉద్యోగం పొందడం సులువవుతుందని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే రాష్ట్రంలో గ్రూప్-1 అధికారులకు ప్రాధాన్యం పెరిగిందని అంటున్నారు.
500కు పైగా గ్రూప్-1 పోస్టులు
గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో గ్రూప్-1 పోస్టులు భర్తీ చేస్తున్నది. ఇదివరకు ఎప్పుడూ 200 నుంచి 300 మధ్యనే గ్రూప్-1 పోస్టులు భర్తీ చేసేవారు. ఈ పోస్టుల్లోనూ తెలంగాణకు వందలోపు ఉద్యోగాలే వచ్చేవి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 2011 తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం సంతోషంగా ఉందని పలువురు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2018లో 121 గ్రూప్-1 పోస్టులు (2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెలువడిన నోటిఫికేషన్ ఆధారంగా) భర్తీ చేశారు. ఆ తర్వాత తొలిసారి రాష్ట్రంలో 503 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతం వారికే అన్ని పోస్టులూ దక్కే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేటగిరీల్లో భర్తీ చేయ నున్నారు. జిల్లాస్థాయిలో ఉన్న పోస్టుల్లో 95శాతం స్థానికులకే దక్కనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర జోన్లలో ఓపెన్ కేటగిరీలో మరో 5శాతం ఉద్యోగాలు పొందవచ్చు.
అప్డేట్ మెటీరియల్ ఉండాలి 
సుదీర్ఘ నిరీక్షణ, తెలంగాణ ఏర్పాటు అనంతరం గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 500కు పైగా గ్రూప్-1 ఉద్యోగాలను రాష్ట్ర సర్కారు భర్తీ చేస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం వారికి ఉద్యోగావకాశాలు చాలా తక్కువ వచ్చేవి. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా అన్ని ఉద్యోగాలూ తెలంగాణ వారికే దక్కుతాయి. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించనున్నాయి. నోటిఫికేషన్లు వస్తున్న క్రమంలో యువత హైరానాపడొద్దు. గత నోటిఫికేషన్, ఇప్పటి నోటిఫికేషన్లకు సంబంధించి సిలబస్‌లో చాలా తేడా ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండే మెటీరియల్‌ను ఎంచుకోవాలి. ఇపుడు అభ్యర్థులకు ఇది ఒక సవాల్‌గా మారింది. ఒకే సబ్జెక్టుకు సంబంధించి పది రకాల పుస్తకాలు కొనకుండా ఒక ప్రామాణికమైన (స్టాండర్డ్) బుక్ ఒకటి కొంటే సరిపోతుంది. ఈ బుక్‌నే ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. ఇతరులు రాసిన మెటీరియల్ కాకుండా మనమే సొంతంగా తయారు చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. మెయిన్స్ కోసం రాత ప్రాక్టీస్ చేయాలి. ఇచ్చిన స్థలంలోనే ప్రశ్నకు సూటిగా సమాధానం రాసేలా సంసిద్ధులు కావాలి. తెలుగు అకాడమీ పుస్తకాలతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
– వీ జగదీశ్వర్, హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి
సివిల్స్ స్థాయిలో కష్టపడాలి
సివిల్స్ పరీక్ష స్థాయిలో కష్టపడి చదివితేనే గ్రూప్-1లో విజయం సాధించడం తేలికవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంత పెద్దమొత్తంలో గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయలేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 500కు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నది. ఇది ఉద్యోగార్థులకు సువర్ణావకాశం. నోటిఫికేషన్లో తెలిపిన సిలబస్ ఆధారంగా బుక్స్ ఎంపిక చేసుకోవాలి. తెలంగాణ చరిత్ర, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన సంఘటనలు, కొత్త రాష్ట్రంలో అమలవుతున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై తప్పకుండా పట్టు సాధించాలి. సాయుధ పోరాటం, జనరల్ స్టడీస్, వర్తమాన అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
– జీ పల్లవి, కమాలాపుర్ ఎంపీడీవో
గ్రూప్ -1 పోస్టుల వివరాలు
డిప్యూటీ కలెక్టర్లు : 42
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కేటగిరీ -2) : 91
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ : 48
రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు : 04
జిల్లా పంచాయతీ అధికారులు : 05
జిల్లా రిజిస్ట్రార్లు : 05
డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ జైల్స్: 02
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ : 08
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్: 26
మున్సిపల్ కమిషనర్స్ గ్రేడ్-2 : 41
డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్/అసిస్టెంట్ డైరెక్టర్లు : 03
జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులు : 05
జిల్లా గిరిజన సంక్షేమాధికారులు : 02
జిల్లా ఉపాధి కల్పన అధికారులు : 02
మెడికల్లోఅడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ : 20
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు : 38
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు : 40
ఎంపీడీలు : 121