సుబేదారి, మే 2 : ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి సూచించారు. ట్రాఫిక్ రూల్స్, లా అండ్ ఆర్డర్‌పై అడిషనల్ డీసీపీ పుష్పారెడ్డి ఆధ్వర్యంలో వరంగల్, కాజీపేట, హనుమకొండ ట్రాఫిక్ పోలీసు అధికారులతో సోమవారం కమిషనరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల క్రమబద్ధీకరణ, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రూల్స్ అధిగమించే వాహనదారులపై తీసుకోవాల్సిన చర్యలపై సీపీ వివరించారు. అనంతరం మాట్లాడుతూ సిబ్బంది ఠాణాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.
ట్రాఫిక్ సమస్య, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తగిన చర్య లు తీసుకోవాలని సూచించారు. వాహనదారులు రోడ్లపై కాకుండా నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసేలా చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించేలా చూడాలని, ఓవర్ స్పీడ్, మద్యం మత్తులో డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వాహనదారులకు జరిమానాలు విధించాలని పేర్కొన్నారు. రోడ్లపై ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే తక్షణమే లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అందిచాలని సీపీ సూచించారు. ఈ సందర్భంగా బ్రీతింగ్ అనలైజర్ మిషన్లను ట్రాఫిక్ పోలీసు అధికారులకు అందజేశారు.