గీసుగొండ, మే 1 : మరియపురం గ్రామాన్ని మిగతా గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. మరియపురం జాతీయ ఉత్తమ జీపీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆదివారం గ్రామంలో పర్యటించారు. వైకుంఠధామం, యోగా సెంటర్, నర్సరీని పరిశీలించారు. అనంతరం జీపీ కార్యాలయంలో సర్పంచ్ అల్లం బాలిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును మరియపురం సాధించడం గొప్ప విషయమన్నారు. మరియపురం గ్రామాభివృద్ధి లర్నింగ్ లెస్సన్‌గా ఉపయోగపడుతుందన్నారు. మూడు సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసేందుకే గ్రామానికి వచ్చినట్లు తెలిపారు.
ప్రజల భాగస్వామ్యం ఉంటే ఆ గ్రామాలు ఆదర్శంగా రూపొందుతాయన్నారు. ఈ నెల 20నుంచి పల్లెప్రగతిపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, అందరికీ మరియపురం గ్రామం సాధించిన ప్రగతిని ఒక లెస్సన్‌గా చెబుతామన్నారు. ఐఎఏస్ శిక్షణ సమయంలో సందర్శించిన మేఘాలయాలోని నేహాలియా, మహారాష్ట్రలోని హాలీబజార్ గ్రామాల గురించి చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీవో సంపత్‌రావు, డీపీవో నాగపూరి స్వరూప, ఎంపీడీవో రమేశ్, ఎంపీపీ భీమగాని సౌజన్య, ఎంపీటీసీ బేతినేని వీరరావు, ఏపీవో మోహన్‌రావు, ఏపీఎం సురేశ్‌కుమార్, ఎంపీవో ప్రభాకర్, కార్యదర్శి స్వప్న, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ నిర్మలామేరీ తదితరులు పాల్గొన్నారు.