రాయపర్తి, మే 1 : అల్లా దయతోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు జాతీయ స్థాయిలో అవార్డులను వస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముస్లింలకు రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తరఫున దుస్తుల పంపిణీ, ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాసం ఉంటూ దానధర్మాలకు అత్యంత ప్రాధాన్యమివ్వడం అభినందనీయమన్నారు. ఆత్మాభిమానంతో జీవించడం వారి ప్రత్యేకత అని, కష్టించేతత్వానికి ముస్లింలు బ్రాండ్ అంబాసిడర్లని అభివర్ణించారు.
గత ప్రభుత్వాలన్నీ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశాయని, వారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్‌కు ముస్లింల అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక నజర్ ఉందని, చరిత్రలో ఏనాడు లేని విధంగా ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం అందజేస్తున్నారని వివరించారు. మండలంలో మసీదులు, అశూర్ఖానాలు, ఖబ్రస్తాన్ల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బానోత్ హరిసింగ్, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, మసీద్-ఏ-నూర్, మసీద్-ఏ-ఆలంగీర్ల సదర్సాహెబ్లు మహ్మద్ లాయఖ్ అలీ, నయాం, నాజర్, అమ్జద్‌పాషా, బాషామియా, షరీఫ్, అన్వర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.