నయీంనగర్, ఏప్రిల్ 27: విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కావద్దని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ తాటికొండ రమేష్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పీ మల్లారెడ్డి అధ్యక్షతన విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్లో పాల్గొనటం వల్ల శారీరకంగా, మానసికంగా ఎదుగుతారని తెలిపారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రిజిస్ట్రార్ బీ వెంకట్రామరెడ్డి, మేఘనరావు, అసిం ఇక్బాల్, వీ మహేందర్, రాధిక, సుమలత, సహాయ రిజిస్ట్రార్ బీ నేతాజీ పాల్గొన్నారు.
ఎంపిక చేసిన కోర్సుల్లో భాగస్వామ్యం వహిస్తాం
ఎంపిక చేసిన కోర్సుల్లో బ్రిటీష్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ఆచార్య తాటికొండ రమేష్ అన్నారు. బుధవారం బ్రిటిష్ వెల్ష్ యూనివర్సిటీ ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు, బ్రిటీష్ కమిషనర్ అధికారులతో కేయూలోని కమ్యూనిటీ ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన విభాగాలతో భాగస్వామ్యం వహించేందుకు కేయూ సిద్ధంగా ఉందని చెప్పారు. ఫార్మసీ, మేనేజ్మెంట్, సైకాలజీ, జర్నలిజం, మైక్రో బయాలజీ, బయో టెక్నాలజీ, మైనింగ్, కమ్యూనిటీ హెల్త్, ట్రైబల్ స్టడీస్, ఆంత్రోపాలజీ సబ్జెక్టులు పరిగణలో ఉన్నాయని, వెల్ష్ పరిధిలోని ఎనిమిది యూనివర్సిటీల ఆధారంగా భాగస్వామ్యం ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ఆర్ వెంకటరమణ, బ్రిటిష్ హై కమిషనర్ అధికారి జనక పుష్పనధాన్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రవీందర్, వెల్ష్ యూనివర్సిటీ ప్రతినిధి హరీష్ లోఖం, రిజిస్ట్రార్ ఆచార్య బి వెంకట్రామరెడ్డి, దూర విద్య కేంద్ర సంచాలకులు టి శ్రీనివాసరావు, నెట్వర్ సంచాలకులు మంచాల సదానందం పాల్గొన్నారు.