బిండ్: మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. వేగంగా వస్తున్న బస్సు, వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఏడు మంది గాయపడ్డారు. జాతీయ రహదారి 719పై చిమ్కా గ్రామ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 2.30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గోహద్ చౌరాహ్ పోలీసు స్టేషన్ పరిధిలో.. జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారి మనీశ్ ధాకడ్ తెలిపారు.
ఖాళీగా వెళ్తున్న బస్సు.. ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న వ్యాన్‌ను ఢీకొన్నది. దీంతో ఆ వ్యాన్‌లో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. దాంట్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడ్డవారిని చికిత్స కోసం గ్వాలియర్‌కు తరలించారు. ప్రత్యక్ష సాక్ష్యుల ప్రకారం.. బస్సు బలంగా ఢీకొనడంతో వ్యాన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రయాణికులు దాంట్లో చిక్కుకుపోయారు. స్థానికులు రెస్క్యూ చేశారు.
బిండ్ నుంచి గ్వాలియర్ వెళ్తున్న వ్యాన్ .. ఓ వెడ్డింగ్ పార్టీని దించి గ్వాలియర్ నుంచి వెనక్కి వస్తున్న బస్సును ఢీకొన్నది. ప్రాథమిక సమాచారం ప్రకారం అధిక వేగమే ప్రమాదానికి కారణం అని తెలిసింది.