వరంగల్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సామాజిక, రాజకీయ ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మొదటినుంచీ సెంటిమెంట్‌గా నిలిచింది. టీఆర్ఎస్ ఉద్యమ, పరిపాలనా ప్రస్థానంలో కీలక మలుపులకు వరంగల్ కేంద్ర బిందువుగా ఉన్నది. రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలకు, టీఆర్ఎస్కు కలిసి వచ్చిన అంశాలకు వరంగల్ నుంచే అడు గులు పడ్డాయి. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమానికి కలిసి వచ్చిన ఎన్నో పరిణామాలు వరంగల్ కేంద్రంగానే జరిగాయి. టీఆర్ఎస్ ఆవిర్భావం ముఖ్యమైన కార్యక్రమాలు, మంత్రు ల రాజీనామా తర్వాత సభలు, తెలంగాణ సాధన లక్ష్యంగా కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో నినాదం ప్రకటన అన్నీ వరంగల్ కేంద్రంగానే జరి గాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా సాగిన ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదలైన ఎన్నో పథకాలకు వరంగల్ ఘటనలే స్ఫూర్తిగా నిలిచాయి. గ్రామాల ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మార్చిన చెరువుల పునరుద్ధరణకు వరంగల్‌ను పరిపాలించిన కాకతీయులే స్ఫూర్తిగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగుకు సమీపంలోని తండాలో పెండ్లి ఖర్చుల కోసం దాచిపెట్టిన డబ్బు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఘటన నుంచే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెరపైకి వచ్చాయి. వరంగల్‌లోని బస్తీల పర్యటన నుంచే డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం ఆచరణలోకి వచ్చింది.
నేడు ఊరూరా జెండా పండుగ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నేడు ప్లీనరీ జరుగుతున్నది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల ముఖ్యనేతలకు ఆహ్వానం అందింది. ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి వెళ్తుండగా.. అన్ని గ్రామాలు, బస్తీల్లో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించింది. ఈ మేరకు ప్రతి ఊరిలో గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతుబంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి పార్టీ శ్రేణులతో జెండా పండుగ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డు కమిటీల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటూనే ఆహ్వానాలు అందిన ముఖ్యనేతలు హైదరాబాద్‌లో జరిగే ప్లీనరీలో పాల్గొనాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ప్లీనరిలో చర్చించిన అంశాలను గ్రామాల్లో ప్రజలకు వివరించే ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు.
తండ్రి కష్టం నుంచి కల్యాణలక్ష్మి 
ములుగు, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ) : 2002లో వెంకటాపూర్ మండలం బూర్గుపేట, ములుగు మండలంలోని భాగ్యతండాలో అగ్ని ప్రమాదం కారణంగా ఇండ్లు కాలిపోగా విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆయా గ్రామాలకు వచ్చారు. పార్టీ తరఫున బాధితులకు అండగా నిలిచారు. భాగ్యతండాకు చేరుకున్న సమయంలో కీమానాయక్ తన బిడ్డ పెండ్లికి దాచుకున్న డబ్బు, బంగారం కాలిబూడిద అయ్యాయని తెలుసుకుని ఆయన భుజం తట్టి ఆ పేద తండ్రి బాధ్యతను స్వీకరించి సొంత ఖర్చులతో అతడి బిడ్డ కల్పన పెండ్లి చేయించారు. పెట్టుపోతలను సైతం అందించారు. ఈ సంఘటన ఆధారంగానే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇటీవలే కల్పన బిడ్డ చంద్రకళ వివాహం కూడా జరుగగా ఆమెకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కును అందించింది.
టీఆర్ఎస్ ప్రస్థానంలో ఓరుగల్లు..
2001 జూన్ 21 కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ.
2002 ఏప్రిల్ 21న వరంగల్ జిల్లాలోని బస్వాతండాను కేసీఆర్ సందర్శించారు. అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.
2002 అక్టోబర్ 28న కరెంటు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భూపాలపల్లిలో బహిరంగ సభ.
2003 ఏప్రిల్ 26న సిద్దిపేట నుంచి వరంగల్ వరకు 100 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ. ఏప్రిల్ 27న వరంగల్ జైత్రయాత్ర పేరిట భారీ బహిరంగ సభ. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ, అప్పటి వ్యవసాయ మంత్రి అజిత్‌సింగ్ హాజరు.
2003 అక్టోబర్ 22న టీఆర్ఎస్ ప్రతిష్టాత్మక కార్యక్రమం పల్లెబాటను మేడారంలో కేసీఆర్ ప్రారంభించారు.
2003 డిసెంబర్ 5న జనగామలో ఓరుగల్లు వీరగర్జన బహిరంగ సభ.
2004 సాధారణ ఎన్నికల్లో వరంగల్, హన్మకొండ లోక్‌సభ స్థానాలు, హన్మకొండ, స్టేషన్‌ఘన్‌పూర్, చేర్యాల, నర్సంపేట, పరకాల, చెన్నూరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం.
2005 జూలై 17 వరంగల్‌లో భారీ బహిరంగసభ. అప్పటి కేంద్ర మంత్రి శరద్‌పవార్ హాజరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆరుగురు టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసిన తర్వాత నిర్వహించిన మొదటి సభ ఇదే.
2007 ఏప్రిల్ 27 తెలంగాణ విశ్వరూప మహాసభ పేరుతో టీఆర్ఎస్ ఆరో వార్షికోత్సవం.
2006లో భూపాలపల్లిలో నిర్వహించిన పార్టీ సభకు కేసీఆర్ వచ్చారు.
2007లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం.
2008 ఫిబ్రవరి 16న కేసీఆర్ మేడారం సందర్శన. వనదేవతలకు మొక్కులు.
2008 జూన్ 1న ఉప ఎన్నికల ఫలితాలు. హన్మకొండ లోక్‌సభ, చేర్యాల స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు.
2009 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు.
2009 నవంబరు 23న కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల జేఏసీ బహిరంగసభ. 14 విద్యార్థి సంఘాలతో సమావేశం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ నినాదం ప్రకటన.
2009, 2014 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సిరికొండ మధుసూదనా చారి గెలుపు కోసం ఎన్నికల బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు.
2010 ఫిబ్రవరి 7న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
2010 సెప్టెంబర్ 3న పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో టీఆర్ఎస్ బహిరంగసభ.
2010 డిసెంబర్ 16న తెలంగాణ మహాగర్జన పేరుతో నగరంలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో భారీ బహిరంగసభ. ఆర్య సమాజ్ అధ్యక్షుడు స్వామి అగ్నివేశ్ ముఖ్యఅతిథిగా హాజరు. ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగసభగా రికార్డు.
2012లో స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నిక ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
2012 మే 2 నుంచి 7వరకు పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పల్లెబాట కార్యక్రమం నిర్వహణ.
2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ..వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం.
2015 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం.
2015 నవంబర్ 24న వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల రికార్డు మెజారిటీతో ఘన విజయం.
2015 డిసెంబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక.
2015లో శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గం ద్వారా వెళ్తూ ములుగులో ఆగి ప్రజలకు అభివాదం చేశారు.
2016 మార్చిన 9న గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఫలితాలు. 58 డివిజన్లలో 44 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్.
2017 ఏప్రిల్ 27 నగరంలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో ప్రగతి నివేదిన పేరుతో భారీ బహిరంగసభ.
2017లో కన్నాయిగూడెం మండలం వద్ద గోదావరి నది వద్ద నిర్మిస్తున్న దేవాదుల పంప్‌హౌస్‌ను సందర్శించారు.
2018 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లోని 11 స్థానాల్లో ఘన విజయం.
2018 నవంబర్ 30 ములుగులోని తంగేడు మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ములుగును జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు.
2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో విజయం.
2019 మేలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఆరు జెడ్పీలు, 98శాతం ఎంపీపీల్లో గెలుపు.
2019 జూన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఘనం విజయం
2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో గెలుపు.
2021 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు.
2021 ఏప్రిల్-మేలో జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యతతో గెలిచింది.