సబ్బండవర్గాల ఆకాంక్షల సాధనే లక్ష్యంగా అహింసాయుతంగా.. అవిశ్రాంతంగా సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎందరో సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా ప్రపంచానికి పరిచయం చేసింది. రోజువారి కూలీగా, పశుల కాపరిగా జీవితాన్ని వెళ్లదీస్తున్న మండల కేంద్రానికి చెందిన ఫణికర మల్లయ్యను తెలంగాణ ధీరునిగా నిలబెట్టింది. ‘మా తెలంగాణ మాకిత్తె మా బతుకేదో మేం బతుకుతం.. నువ్వు సరేనంటె ఇత్తరట గద సారూ” అంటూ అప్పటి కరుడుగట్టిన సమైక్యవాది, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నిలదీసిన మల్లయ్య ద్వారా ఇక్కడి మనుషుల తెగువను చాటింది.
2004 సాధారణ ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడ్డ టీడీపీకి జవసత్వాలు నింపాలన్న కాంక్షతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 2008 మేలో ‘మీ కోసం’ పేరుతో యాత్ర చేపట్టాడు. దారి వెంట రైతులు, కూలీలు, మహిళలతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకొని ప్రజల్లో సానుభూతి పొందే లక్ష్యంతో అదే సంవత్సరం మే 8న ఖమ్మం జిల్లాకేంద్రం నుంచి మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి, తొర్రూరు మీదుగా వరంగల్ వెళ్లేందుకు రాయపర్తికి బయల్దేరాడు. గ్రామ శివారులో వ్యవసాయ ప నులు చేస్తున్న కూలీల వద్దకు మందీమార్బలంతో వెళ్లి ‘మీలో నాతో ఎవరు మాట్లాడుతారు’ అంటూ ప్రశ్నించారు. ఎవరూ రాకపోవడంతో అక్కడే వరి మెదలు కడుతున్న ఫణికర మల్లయ్య ‘నేను మాట్లాడుతా అయ్యా’ అంటూ ముందుకు వచ్చాడు. ‘మా తెలంగాణ మాకిత్తె మా బతుకేదో మేం బతుకుతం’ అని చంద్రబాబును సూటిగా నిలదీయడంతో ఆయ న బతుకుజీవుడా అంటూ చల్లగా జారుకున్నా రు. విషయం తెలిసి ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మల్లయ్యను తన వద్దకు పిలిపించుకొని ఘనంగా సన్మానాలు చేయించారు. ఎక్కడ టీఆర్ఎస్ సభ జరిగినా మల్లయ్యను వేదిక పైనుంచి ప్రజలకు పరిచయం చేస్తూ ఉద్యమానికి ఊపిరిలూదారు.
ఆర్థిక సాయం చేసి..అండగా ఉండి.. 
మల్లయ్య కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న కేసీఆర్, తన నివాసంతో పాటు ప్రగతి భవన్‌కు పలుమార్లు పిలిపించుకొని తనతోపాటు భోజనం చేశారు. మల్లయ్య బిడ్డలు రేణుక, మమత వివాహాల కోసం రూ.5లక్షల చొప్పున, మల్లయ్య జీవనం కోసం మరో రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.14లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అప్పటి పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్‌రావుతో అందించారు.
పండుగోలె టీఆర్ఎస్ పాలన 
ఇంటిపార్టీ టీఆర్ఎస్ సర్కారు పాలన పండుగోలె సాగుతున్నది. రాష్ట్రంల అందరికి న్యాయం జరుగుతున్నది. టీఆర్ఎస్ గద్దెనెక్కిన కాన్నుంచి ప్రజల బాగోగుల కోసమే తండ్లాడుతాంది. జనాల కట్టాలు పోగొట్టేందుకు సీఎం సారు శాన తిప్పలు వడుతాండు. మునుపెన్నడు ఇసోంటి పాలన చూసింది లేదు. ఆంధ్రోళ్లు ఉన్నప్పుడు చెర్లల్ల కశ్కెడు మట్టి సుత తియ్యకపాయె. తెలంగాణ కోసం ఊళ్లపొంటి తిరుగుతున్నప్పుడు చూసిన కేసీఆర్ సారు చెర్ల పూడిక తీయించి రైతులల్ల నమ్మకం పెంచిండు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు, పెండ్లిళ్లకు సాయం, బడి పొలగాండ్లకు సన్న బియ్యం, ఇంటింటికి మంచినీళ్లు, రేషన్ కారట్లకు ఎక్కువ బియ్యం ఇచ్చుడు.. ఇట్ల ఒక్కటేంది ఎన్నో మంచి పనులు చేస్తాండు. ఇగ ఈ సర్కారు ఢోకా లేదు.
– ఫణికర మల్లయ్య