నర్సంపేట/నర్సంపేట రూరల్, ఏప్రిల్ 26: వేసవిలో ఎండలు పెరిగినందున మొక్కలకు క్రమం తప్పకుండా నీరందించాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ జీపీ సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఆయన చెన్నారావుపేట మండలం కోనాపురంలో పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. విలేజ్ పార్కులోని ప్రతి మొక్కనూ రక్షించాలని సూచించారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంపీడీవో దయాకర్, ఏపీవో అరుణ ఉన్నారు. అలాగే, నర్సంపేట మండలంలోని రామవరం శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, నర్సరీని హరిసింగ్ పరిశీలించారు. పల్లెప్రగతి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జీపీ సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జీపీ రికార్డులను పరిశీలించారు. గ్రామంలోని రెండు వార్డుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, జీపీ నిధులు సరిపోవడం లేదని సర్పంచ్ కొడారి రవన్న, వార్డు సభ్యుడు కోరబోయిన కుమారస్వామి హరిసింగ్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన స్పెషల్ గ్రాంట్ నుంచి లక్ష రూపాయల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కార్యదర్శి నీలం వీరేశం, వార్డు సభ్యులు ఉన్నారు.
ఉపాధి పనుల్లో వేగం పెంచాలి: ఎంపీపీ
ఖానాపురం/నర్సంపేటరూరల్/దుగ్గొండి: మండలవ్యాప్తంగా ఉపాధిహామీ పనులను వేగవంతం చేయాలని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు సూచించారు. మంగళవారం మండలకేంద్రం శివారులోని పంట కాల్వల్లో చేపట్టిన ఉపాధి పనులను ఎంపీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు.
పనులు చేసే చోట ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి చేరుకొని వీలైనంత త్వరగా పనులు ముగించుకొని ఇంటికి వెళ్లాలని కూలీలకు సూచించారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి పనులను వినియోగించుకోవాలని కోరారు. ఎక్కువ పనిదినాలు చేసేలా మేట్లు పనులను గుర్తించాలన్నారు. నర్సంపేట మండలంలోని మహేశ్వరం, లక్నేపల్లి, గురిజాల, ముత్తోజిపేట, మాదన్నపేట, రాజేశ్వర్రావుపల్లి, జీజీఆర్‌పల్లి, ఇటుకాలపల్లిలో ఫీడర్ చానల్, ఫిష్పాండ్స్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం సర్పంచ్‌లు మాడ్గుల కవిత, గొడిశాల రాంబాబు, గొడిశాల మమత, గోలి శ్రీనివాస్‌రెడ్డి, మొలుగూరి చంద్రమౌళి, బొజ్జ యువరాజ్, తుత్తూరు కోమల, మండల రవీందర్, కార్యదర్శులు, టీఏలు, కారోబార్లు పనులను పర్యవేక్షించారు. నిబంధనల ప్రకారం పనులు చేసి వేతనాలు పొందాలని కూలీలకు సూచించారు. దుగ్గొండి మండలం తిమ్మంపేటలోని రాయినికుంట, నాయిని చెరువు, తుమ్మల చెరువులో జరుగుతున్న ఈజీఎస్ పనులను సర్పంచ్ మోడెం విద్యాసాగర్‌గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు తాగునీరు, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని, మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో టీఏ చీర కటయ్య, కార్యదర్శి రమేశ్, కారోబార్ అశోక్‌రెడ్డి, సుమలత, నర్మద పాల్గొన్నారు.