నర్సంపేట, ఏప్రిల్ 26: ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని 21వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభతరుణంలో వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కోరారు. కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ దేశంలోనే తెలంగాణను అత్యున్నత స్థాయికి చేర్చారన్నారు. ఈ ప్రయాణంలో రాష్ట్ర ప్రజల కృషి, భాగస్వామ్యం ఎంతో విలువైందన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యదీక్షతతో టీఆర్ఎస్ 21వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా బుధవారం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రతి వార్డులో గులాబీ జెండాలు రెపరెపలాడాలన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు.
వాడవాడలా జెండా ఎగురవేద్దాం..
గిర్మాజీపేట: టీఆర్ఎస్ 21వ వసంతంలోకి అడుగిడుతున్న తరుణంలో తూర్పు నియోజకవర్గంలోని వాడవాడలా గులాబీ జెండా ఎగురవేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను పండుగలా జరుపుకోవాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. స్వరాష్ట్ర కాంక్షను నిజం చేసి, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశంలోనే ముందు వరుసలో నిలిపిన సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిందన్నారు. ఇందులో నాయకులు, కార్యకర్తల కృషి గొప్పదని ఎమ్మెల్యే కితాబిచ్చారు.
కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గం, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొని జెండావిష్కరణ, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలని కోరారు. అలాగే, టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని 25, 26వ డివిజన్ల కార్పొరేటర్లు బస్వరాజ్ శిరీషాశ్రీమాన్, బాలిన సురేశ్ వేర్వేరు ప్రకటనల్లో పిలుపునిచ్చారు. మండిబజార్‌లోని జూమ్ టైలర్ వద్ద, ఎల్లమ్మగుడి వద్ద పార్టీ జెండాల ఆవిష్కరణతోపాటు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం ఉంటుందని తెలిపారు.
గులాబీ జెండాలు గుబాలించాలి
నల్లబెల్లి/నెక్కొండ/ఖానాపురం/గీసుగొండ: మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం గులాబీ జెండాలు గుబాలించాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా అన్ని గ్రామాల్లో గులాబీ జెండాలను ఆవిష్కరించాలని కోరారు. ఆయన వెంట ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌లు రాజారాం, నిర్మలా రవీందర్‌రెడ్డి, బొట్ల సువర్ణ, మామిండ్ల మోహన్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ గోనెల పద్మా నరహరి, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. నెక్కొండ మండలంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య పిలుపునిచ్చారు. ఖానాపురం మండలంలో టీఆర్ఎస్ జెండాలను ఎగురవేయాలని పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య పిలుపునిచ్చారు. గీసుగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో నేడు ఉదయం 8 గంటల వరకు గులాబీ జెండాలను ఆయా గ్రామాల అధ్యక్షులు ఎగురవేయాలని పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్ సూచించారు.