నర్సంపేట రూరల్, ఏప్రిల్ 19 : ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ అందనున్నది. సిలిండర్‌కు బదులు అండర్ గ్రౌండ్ ద్వారా పట్టణ ప్రజలకు, అలాగే ఇతర అవసరాల కోసం సర్వాపురం శివారులో పీఎన్జీ(పైప్డ్ నేచురల్ గ్యాస్), సీఎన్జీ (కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్) పైప్లైన్లు వేయగా నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్మంత్రి చేతులమీదుగా డిస్ట్రిబ్యూషన్, స్టోరేజీ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా నర్సంపేటలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫలితంగా మహిళలు కష్టాలు తీరడమే గాక పట్టణం కాలుష్యరహితంగా మారనుంది.
బుకింగ్, రవాణా కష్టాలకు చెక్
పైప్‌లైన్ గ్యాస్‌తో ప్రజలకు ఇబ్బందులు తీరనున్నాయి. నర్సంపేటలోని 24 వార్డుల పరిధిలో అవసరమున్న వారు దరఖాస్తు చేసుకుంటే అండర్ గ్రౌండ్ ద్వారా స్టవ్‌కు కనెక్షన్ ఇస్తారు. వినియోగాన్ని బట్టి బిల్లు వస్తుంది. ఆన్లైన్ చెల్లిస్తే చాలు. ఈ విధానం అమలులోకి రావడంతో బుకింగ్, రవాణా, సిలిండర్ ఆలస్యంగా రావడం లాంటి సమస్యలు ఉండవు. తొలుత గుజరాత్ జీఐటీఎల్ కంపెనీ పైప్లైన్లు ఏర్పాటుచేయగా మెగా ఇంజినీరింగ్ సంస్థ గ్యాస్ సరఫరా చేయనుంది. నర్సంపేట పట్టణంతో పాటు విలీన గ్రామాలైన కమలాపురం, సర్వాపురం, ద్వారకపేట గ్రామాల ప్రజలకు కూడా ఇంటింటికి గ్యాస్ అందుబాటులోకి రానుంది.
వినియోగాన్ని బట్టి బిల్లు
విద్యుత్ కనెక్షన్ తరహాలో ప్రతీ ఇంటికి గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుచేస్తారు. వినియోగదారులు ఎంత వాడుకుంటే అంతే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ గ్యాస్ ప్రాజెక్టు కోసం గతంలో జాతీయ స్థాయిలో టెండర్లు పిలువగా రాష్ట్రంలో మెగా కంపెనీ దక్కించుకుంది. పైప్‌లైన్‌తో పాటు ప్రతీ ఇంటికి ఒక రెగ్యులేటర్ అమరుస్తారు. దీని ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సర్వాపురం, ద్వారకపేట గ్రామాల మీదుగా పట్టణంలోని అన్ని వార్డుల్లో పీఎన్జీ, సీఎన్జీ గ్యాస్‌తోపాటు ఇంటర్ నెట్ సౌకర్యం కోసం పైప్‌లైన్ నిర్మాణ పనులు పూర్తి చేశారు.
గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం కోసం నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేశారు.