గీసుగొండ, ఏప్రిల్ 19: విద్యతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. చల్లా చారిట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గీసుగొండ, సంగెం, ఖిలావరంగల్ మండలాలకు చెందిన యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని గీసుగొండ మండలంలో ఎస్ఎస్గార్డెన్లో మంగళవారం ఎమ్మెల్యే, డీసీపీ వెంకటలక్ష్మి ప్రారంభించారు. అనంతరం చల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాల్లో పరకాల నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలిపేందుకు పోటీ పడి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం భారీ ఉద్యోగ నోటిపికేషన్ వేయనున్నందున నియోజకవర్గంలోని యువతీ యువకులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చులతో ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. 70 రోజులపాటు యువతీ యువకులు ఈ శిక్షణ శిబిరానికి రావాలని సూచించారు. మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటలకే క్లాసులు ప్రారంభం అవుతాయని తెలిపారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో 500 మందికి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే టెక్స్టైల్ పార్కులో రెండు కంపెనీలు ప్రారంభం కానున్నట్లు వివరించారు. ఆ కంపెనీలో నియోజకవర్గంలోని యువతీ యువకులకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుందన్నారు.
యువత కష్టపడి చదవాలి
కష్టపడి చదివితేనే ఏదైనా సాధించొచ్చని డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. తాను మూడో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికైనట్లు చెప్పారు. పట్టుదల ఉంటే సాధించే వరకూ ప్రయత్నం చేయాలని యువతకు సూచించారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే కుటుంబానికి భరోసా ఉంటుందన్నారు. కార్యక్రమంలో గీసుగొండ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సంగెం ఎంపీపీ కందకట్ల కళావతి, సంగెం జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, కార్పొరేటర్లు ఆకుల మనోహర్, గద్గె బాబు, సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, టీఆర్ఎస్ మండల కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు జైపాల్‌రెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, నాగేశ్వర్రావు, మల్లారెడ్డి, బాబు, నాయకులు శివకుమార్, మాధవరెడ్డి, నరహరి, శ్రీకాంత్, ప్రమాద్, లెనిన్, ప్రసాద్, టీఆర్ఎస్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.