వరంగల్, ఏప్రిల్ 17(నమస్తేతెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ససేమిర అనడంతో రైతుల నుంచి యాసంగి ధాన్యాన్ని క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,960తో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గత మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా లో యాసంగి ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులు, ప్రజాప్రతినిధులు, రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
అధికారులు రూపొందించిన ప్రణాళికను పరిశీలించి రైతులకు ఇ బ్బంది కలగకుండా యాసంగి ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆ దేశించారు. శనివారం కలెక్టర్ బీ గోపి వివిధ శాఖల అధికారులు, రైతు సంఘాల నాయకులు, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు, రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాం ట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. రైతు సంఘాల నాయకులు, రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు ఈ సందర్భంగా కొన్ని సమస్యలను దృష్టికితేగా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకొంటామని కలెక్టర్ చెప్పారు. ముఖ్యంగా యాసంగి ధాన్యం కొనుగోలుకు సహకరించాలని ఆయన కోరారు. తేమ, ఇతర కారణాలతో అదనంగా కిలో ధాన్యం కూడా తీసుకోవద్దని స్పష్టం చేశారు. 6 లక్షల గన్నీ సంచులను సమకూర్చుకొనేందుకు ప్రభుత్వ ఆమోదం లభించినట్లు చెప్పారు.
కొనుగోలు కేంద్రాల పెంపు..
ఈ యాసంగిలో రైతులు 78,244 ఎకరాల విస్తీర్ణం లో వరి సాగు చేసినట్లు గుర్తించిన అధికారులు ఇందు లో సన్నరకం పంట విస్తీర్ణం 59,187, దొడ్డు రకం పంట విస్తీర్ణం 19,056 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. ధాన్యం దిగుబడులు 1,86,707 టన్నులు వచ్చే అవకాశం ఉంటే ఇందులో సన్న రకం ధాన్యం 1,35,406, దొడ్డు రకం ధాన్యం 51,301 టన్నులు ఉండనుందని పేర్కొన్నారు. జిల్లా లో 1,86,707 టన్నుల ధాన్యం మరో కొద్ది రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు రావడం మొదలై జూలై వరకు కొనసాగనుందని తెలిపారు. గత వానాకాలం ప్రభు త్వం జిల్లాలో 186 కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా 1,97,073 టన్నుల ధాన్యం కొనుగోలు చేసిం ది. ప్రస్తుతం ధాన్యం దిగుబడులు 1,86,707 టన్ను లు వచ్చే అవకాశం ఉన్నందున 186 కొనుగోలు కేం ద్రాల ఏర్పాటుకు మొదట అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వీటిలో 46 ఐకేపీ, 116 పీఏసీఎస్ లు, 1 జీసీసీ, 2 ఏఎంసీలు, 21 ఎఫ్‌పీవోలకు కేటాయించినట్లు వెల్లడించారు.
తాజాగా 186 సరిపోవని, అదనంగా మరికొన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వస్తుండడంతో అవసరమైన గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని, గత యాసంగిలో 205 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ శనివారం జరిగిన సమావేశంలో ప్రకటించారు. అదనంగా ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అవసరమనేది ప్రతిపాదించాలని రైతు సంఘాల ప్రతినిధులకు ఆయన సూచించారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు 46.67 లక్షల గన్నీ సంచులు అవసరమని అధికారు లు అంచనా వేశారు. టార్పాలిన్లు 3,600, ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు కొనుగోలు కేంద్రానికి ఒకటి చొప్పున, 299 తూకం వేసే యంత్రాలు అవసరమని, వీటిలో టార్పాలిన్లు 3,025, ప్యాడీ క్లీనర్లు 107, తేమ కొలిచే యంత్రాలు 143, తూకం వేసే యంత్రాలు 299 అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
ఐదు సెక్టార్ల ద్వారా రవాణా..
జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం గో నె సంచులను ఐదు సెక్టార్ల ద్వారా రవాణా చేయాలని అధికారులు నిర్ణయించారు. నెక్కొండ సెక్టార్ పరిధిలో నెక్కొండ, చెన్నారావుపేట, దుగ్గొండి, వర్ధన్నపేట సెక్టార్లో రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, వరంగల్, ఖిలావరంగల్, ఖానాపురం సెక్టార్లో ఖానాపురం, నల్లబెల్లి సెక్టార్లో నర్సంపేట, గీసుగొండ, నల్లబెల్లి, పర్వతగిరి సెక్టార్లో పర్వతగిరి మండలం ఉంది. సెక్టార్ వారీగా ప్రభుత్వం ఖరారు చేసే ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు ధాన్యం, గోనె సంచులను రవాణా చేస్తారు. ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు సెంటర్ స్థాయిలో కేంద్రం ఇన్చార్జితో పాటు ఐదుగురు సభ్యులు, గ్రామ రెవెన్యూ అధికారి, ఐదు నుంచి ఆరు కేంద్రాలు ఉండే క్లస్టర్ స్థాయిలో ఒక పర్యవేక్షణ అధికారి, మండల స్థాయిలో మండల ప్రత్యేకాధికారి, మండల వ్యవసాయ అధికారి, డివిజన్ స్థాయిలో సహాయ వ్యవసాయ సంచాలకులు, ఆర్డీవో, జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి, జిల్లా సహకార అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు, డీఎస్వో, అదనపు కలెక్టర్‌ను నియమించేందుకు ప్రభు త్వం నిర్ణయించింది.