హనుమకొండ, ఏప్రిల్ 17 : మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్, హనుమకొండ పర్యటన సందర్భంగా సభా స్థలిని మార్చారు. ముందుగా ఎల్బీ కళాశాల మైదానంలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ టీఆర్ఎస్ నాయకుల సూచనల మేరకు కార్యకర్తల సౌకర్యార్థం హనుమకొండలోని హయగ్రీవాచారి (కుడా) మైదానంలోకి మార్చారు. ఈ నెల 20వ తేదీన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. టీఆర్ఎస్ వరంగల్, హనుమకొండ జిల్లాల ముఖ్య కార్యర్తల సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఎల్బీ కళాశాల మైదానంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతోపాటు పార్కింగ్ సమస్య, ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నందన కుడామైదానంలోకి మార్చినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అభివృద్ధి పనుల సమీక్ష సమావేశం అనంతరం సాయంత్రం పార్టీ కార్యకర్తలతో నిర్వహించే సభలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల నుంచి సుమారు 25 వేల మందికి పైగా కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు.
గ్రౌండ్‌ను పరిశీలించిన చీఫ్ విప్, ఎమ్మెల్యేలు 
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎల్బీ కళాశాల మైదానం నుంచి సభాస్థలిని హయగ్రీవాచారి (కుడా) మైదానంలోకి మార్పు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్‌తో కలిసి కుడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఈ నెల 20న వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు గులాబీ సైన్యం సిద్ధంగా ఉందన్నారు.
హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటన సందర్భంగా పలు శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారని తెలిపారు. అభివృద్ధిపై జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షించనున్నట్లు చీఫ్ విప్ పేర్కొన్నారు. అలాగే, కార్యకర్తలతో నిర్వహించే సభకు సంబంధించి రెండు మూడు స్థలాలను పరిశీలించి హనుమకొండలోని కుడా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారని చీఫ్ విప్ వివరించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ వరంగల్, హనుమకొండ జిల్లాల కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.