ఆదివారం సెలవు దినం కావడంతో కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కరాలకు లక్షమందికి పైగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. నదిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయించారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్ల దర్శనానికి బారులు తీరారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. సాయంత్రం అర్చకులు త్రివేణీ సంగమం వద్ద ప్రాణహిత నదికి సప్త హారతి ఇచ్చారు. చెన్నైకి చెందిన మహాలక్ష్మీ సేవా సమితి అధ్యక్షురాలు మహాలక్ష్మీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోనూ నదికి ప్రత్యేకంగా హారతి పట్టారు. చెన్నై నుంచి వచ్చిన 30 మంది అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాలు పూర్తయ్యే వరకు హారతి, యాగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని, రోజూ 200 మందికి అన్నదానం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమాల్లో ఈవో మహేశ్, ఎంపీపీ రాణీబాయి, జడ్పీటీసీ అరుణ, ఎంపీటీసీ మమత, సర్పంచ్ వసంత తదితరులు పాల్గొన్నారు.
ప్రాణహిత పుష్కరాల కోసం కాళేశ్వరానికి ఐదో రోజు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు లక్ష మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా పోటెత్తారు. పుష్కర స్నానాలు, ప్రత్యేక పూజలు, పితృతర్పణాలు చేసేవారితో ఘాట్లు కిటకిటలాడాయి. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్లకు నిరంతరం అభిషేకాలు కొనసాగాయి. ఐదోరోజు వివిధ పూజలు, లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.6,92,500 ఆదాయం వచ్చినట్లు ఈవో మహేశ్ తెలిపారు.