వరంగల్, ఏప్రిల్ 16 : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నగర పర్యటనలో భాగంగా నిర్వహించనున్న వరంగల్, హనుమకొండ జిల్లాల బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహించే ఎల్బీ కళాశాల మైదానాన్ని శనివారం సాయంత్రం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ నెల 20న మంత్రి కేటీఆర్ నగర పర్యటన నేపథ్యంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. టీఆర్ఎస్ వరంగల్, హనుమకొండ జిల్లాల శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారని ఆయన అన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో సుమారు రూ.370 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారని వెల్లడించారు. మరో రూ.300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన వివరించారు. ఎల్బీ కళాశాల మైదానంలో నిర్వహించే సభకు సుమారు 20వేల మంది కార్యకర్తలు హాజరవుతారని అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. 20 వేల మంది గులాబీ సైనికులతో నిర్వహించే సభలో మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. బూత్ స్థాయి కార్యకర్త నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ సభలో పాల్గొంటారని తెలిపారు.
మంత్రి కేటీఆర్ ఇచ్చే సందేశాన్ని కార్యకర్తలు గ్రా మగ్రామానికి తీసుకెళ్తారని వివరించారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూ.వందల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. సభకు రెండు జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వరంగల్ సీపీ తరుణ్‌జోషి, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రాష్ట్ర రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాజనాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ రోడ్లు ముస్తాబు..
వరంగల్, ఏప్రిల్ 16 : నగరంలోని పలు రోడ్లను గ్రేటర్ అధికారులు ముస్తాబు చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ నెల 20న ప్రారంభించనున్న స్మార్ట్ రోడ్లను అం దంగా తీర్చిదిద్దుతున్నారు. ములుగు రోడ్డు నుంచి భద్రకాళి బైపాస్ వరకు లింక్ రోడ్డు, కార్పొరేషన్ ప్రధాన రహదారి నుంచి భద్రకాళి జంక్షన్ వరకు నిర్మించిన స్మార్ట్ రోడ్డు డివైడర్లకు రంగులు వేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి చెట్లను తొలగిస్తున్నారు. అందమైన పూల మొక్కలు ఏర్పాటు చేయనున్నారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రోడ్డు వేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేయనున్న అభివృద్ధి పనుల ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు.