నయీంనగర్, ఏప్రిల్ 15 : వడ్డేపల్లి జంక్షన్లో ట్రాఫిక్ టెన్షన్ నెలకొంది. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వెళుతున్నారు. అటు లేబర్ కూలీలు, ఇటు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో జంక్షన్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉదయం భారీ వాహనాల రాకపోకలతోపాటు జన సందడి అధికంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోందని పలువురు చెబుతున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించే వారు లేకపోవడంతో చాలా సార్లు జంక్షన్లో ఎన్నో ప్రమాదాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కూలీలకు ఎన్నో ఇబ్బందులు
వడ్డెపల్లి జంక్షన్లో లేబర్ కూలీ అడ్డా ఉండడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫుల్ రష్‌గా ఉంటుంది. రోజువారి కూలీలు పని నిమిత్తం యజమానులతో రోడ్లపైనే మాట్లాడుతుంటారు. ఇటు మాట్లాడుతుండగానే పక్క నుంచి పెద్ద పెద్ద వాహనాలు వెళుతుండడంతో నిత్యం ఏం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు మరి. కూలీలు రోడ్లపైనే ఉండడంతో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వడ్డేపల్లి జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి, వాహనాలను నియంత్రించాలని స్థానికులు, కూలీలు కోరుతున్నారు.