ఖానాపురం/దుగ్గొండి, ఏప్రిల్ 2: తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగకు శనివారం ఖానాపురం మండలంలోని ప్రతి ఇంట్లో ఘనంగా జరుపుకొన్నారు. మండలకేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. బుధరావుపేట వేంకటేశ్వరాస్వామి ఆలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్పయ్య, సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్, ఎంపీటీసీ షేక్ సుభాన్‌బీ, మౌలానా, సొసైటీ సీఈవో ఆంజనేయులు, సిబ్బంది రాజు, వినయ్, భీమయ్య పాల్గొన్నారు. దుగ్గొండి మండలవ్యాప్తంగా ప్రజలు శుభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ఉదయాన్నే ఇల్లువాకిళ్లను శుభ్రం చేసుకుకున్నారు. ఉగాది పచ్చడి, పిండి వంటలు తయారు చేసుకొని కుటుంబ సమేతంగా ఆరగించారు. అనంతరం గ్రామ కూడళ్లలో పురోహితులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. మండలంలోని శివాజీనగర్, రేఖంపల్లి, చలపర్తి, కేశవాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, నాచినపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో వేదపండితులు గ్రామస్తులకు పంచాంగం తెలియజేశారు.
ఉట్టిపడిన తెలుగుదనం..
వర్ధన్నపేట: తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు శనివారం మండలంలో ఘనంగా జరిగాయి. ప్రజలు ఉదయమే ఇండ్లలో షడ్రుచులతో కూడిన పచ్చడిని తయారు చేసుకున్నారు. ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేసుకొని వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం వర్ధన్నపేట పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, ఇల్లంద రామలింగేశ్వరాలయం, ల్యాబర్తి శివాలయం, కొత్తపల్లి, నల్లబెల్లి, ఉప్పరపల్లి, చెన్నారం, కట్య్రాలలో వేదపండితులు పంచాంగ శ్రవణం చేశారు. గ్రామాలకు చెందిన ప్రముఖులు, రైతులు, ప్రజుల పంచాంగ శ్రవణంలో పాల్గొని ఈ ఏడాది వచ్చే వర్షాభావ పరిస్థితులు, రాశి ఫలాలు తెలుసుకున్నారు. అలాగే, మండల ప్రజలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు..
రాయపర్తి: మండలంలోని 39 గ్రామాల్లో ఉగాది వేడుకలను సకల వర్గాల ప్రజలు జరుపుకున్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఆరంభ వేడుకల సందర్భంగా ప్రజలు వేకువజామునే నిద్రలేచి ఇల్లు వాకిళ్లు, లోగిళ్లను శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి అందమైన ముగ్గులతో అలంకరించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులంతా తలంటు స్నానాలు ఆచరించి కొత్తకుండలో వేప పువ్వు, మామిడి కాయలు, పచ్చిమిర్చి, బెల్లం, ఉప్పు, కొత్త చింత పండు, కొబ్బరితో షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ఇలవేల్పులకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామాల్లోని ఆలయాలను చేరుకుని స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండలకేంద్రంలోని సీతారామచంద్రస్వామి, రుద్రకోటేశ్వరస్వామి, హనుమాన్ ఆలయాతోపాటు కొత్త రాయపర్తిలోని ఉమామహేశ్వరస్వామి ఆలయం, వేంకటేశ్వరపల్లిలోని స్వయంవ్యక్త వేంకటేశ్వరస్వామి (సన్నూరు) ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాల అనువంశిక పూజారులు ఆరుట్ల రంగాచార్యులు, వెంకట రామకృష్ణమాచార్యులు, వెంకట రమణాచార్యులు, సర్పంచ్ గారె నర్సయ్య, గూబ యాకమ్మ ఎల్లయ్య, నలమాస సారయ్యల సమక్షంలో పంచాంగ శ్రవణాలు పఠించారు.
మామిడి తోరణాలతో అలంకరణ
శుభకృత్ నామ సంవత్సర పర్వదినాన్ని మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఇంటి గుమ్మాలు, దుకాణ సముదాయాలను మామిడి తోరణాలతో అలంకరించారు. ఇష్ట దైవాలకు ప్రత్యేక పూజలు చేసి సంవత్సరమంతా మంచి జరుగాలని కోరుకున్నారు. లక్నేపల్లిలో ప్రధాన అర్చకుడు బాబాశర్మ ప్రజలకు పంచాంగ శ్రావణం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడిశాల రాంబాబుగౌడ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పర్వతగిరిలోని సాయిబాబా ఆలయంలో అర్చకుడు రమణాచార్యులు, ధర్మకర్త చందా శ్రీనివాస్ నేతృత్వంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శివాలయాలు, హనుమాన్ ఆలయాల్లో అర్చనలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. చెన్నారావుపేట మండలంలో ఉగాది సందర్భంగా ప్రజలు తమ ఇండ్లలో ఇష్టదైవానికి పూజ చేసి, భక్ష్యాలు, ఉగాది పచ్చడి, పిండి వంటలు తిని సంతోషంగా గడిపారు.
శనివారం సాయంత్రం సిద్ధేశ్వరాలయంలో ఆలయ చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు భిక్షమయ్యశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఆలయానికి స్థానికులు తరలివచ్చి తమ జాతకాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు సాయిపవన్కల్యాణ్శాస్త్రి, గణేశ్శాస్త్రి, గ్రామస్తులు కోరె కట్టయ్య, ఆరె రమేశ్, కోరె వెంటకయ్య పాల్గొన్నారు. కరీమాబాద్ అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో పూజారి పాలకుర్తి ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. కరీమాబాద్‌లోని బొమ్మలగుడిలో పూజారి శివపురం రామలింగ ఆరాధ్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. బీరన్నకుంటలోని బీరన్నస్వామి ఆలయంలో, కాశీకుంటలోని పోచమ్మతల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయాల్లో పంచాంగ శ్రవణాలు
నర్సంపేట పట్టణ ప్రజలు ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. వాసవీ కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, వేంకటేశ్వరాలయంలో పంచాంగ శ్రవణాలు చేశారు. భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పట్టణంలోని అయ్యప్ప, హనుమాన్, వేంకటేశ్వర, శివాంజనేయ ఆలయాల్లో ప్రత్యేక పూజలతోపాటు పంచాంగ శ్రవణాలు చేశారు. కార్యక్రమంలో పంచాంగ కర్త వెంకటాచారి రామానుజాచార్యులు, మాధవాచార్యులు, కృష్ణమాచార్యులు, రంగనాథస్వామి పాల్గొన్నారు. నర్సంపేట 16వ వార్డులోని రాంనగర్‌కాలనీలో దళిత హిందూ పరిషత్ బాధ్యుడు అనిల్ జీ ఆధ్వర్యంలో ఉగాది సమ్మేళనం నిర్వహించారు. నువ్వుల నూనెలతో తైలాభిషేకం చేశారు. నూతన వస్ర్తాలు ధరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మరాజు పాల్గొన్నారు. డాక్టర్ ఉషారాణి, ఎంవీ కృష్ణారావు, చైర్మన్ ఎర్ర జగన్మోహన్రెడ్డి, రామగోని సుధాకర్, వేమిశెట్టి శ్రీనివాస్, నాగేందర్, గిరి, పాలాయి రవి పాల్గొన్నారు. నెక్కొండ మండలంలో ఉగాది పర్వదిన వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
నెక్కొండలోని శ్రీరామలింగేశ్వరాలయం, పంచముఖ ఆంజనేయస్వామి, ఆంజనేయస్వామి, గుండ్రపల్లిలోని సీతారామంజనేయస్వామి ఆలయాల్లో విశేష పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహించారు. నెక్కొండ రామాలయంలో గణపతి, భవానీ శంకరస్వామి, హనుమత్ లక్షణ సమేత శ్రీసీతారామంద్రస్వామి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. సంగెం మండలం కుంటపల్లి రామలింగేశ్వరాయంలో అర్చకుడు అప్పె నాగార్జునశర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కళావతి, సర్పంచ్ కావటి వెంకటయ్య, నరహరి, ప్రముఖులు లింగయ్య, కాగితాల జగన్నాథచారి పాల్గొన్నారు. అలాగే, మండలంలో అన్ని గ్రామాల్లో పంచాంగ శ్రవణాలు చేపట్టారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోనే వంటలు చేసుకని భోజనాలు ఆరగించి తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోయారు. కార్యక్రమంలో అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫణింద్ర, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
శంకరమఠంలో పంచాంగ శ్రవణం..
వరంగల్ శ్రీశృంగేరి శంకరమఠంలో శారదాంబ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుడు అన్నావజ్జుల సోమశేఖరశర్మ పంచాంగ శ్రవణం చేశారని ప్రధాన అర్చకుడు సంగమేశ్వరజోషి తెలిపారు. కొత్తవాడలోని మార్కండేయ ఆలయం, దేశాయిపేటలోని లక్ష్మీమెగా టౌన్షిప్లో పంచాగం శ్రవణం చేశారు. కాలనీ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీటీ కల్యాణ మండపంలో పంచాగం శ్రవణం చేశారు. ప్రముఖ ఉభయ వేదాంత పండితుడు సముద్రాల శఠగోపాలాచార్యులు రాశి ఫలాలను వివరించారు. ప్రముఖ సంగీత కళాకారుడు అభిషేక్ అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. పలువురు పండితులు, కళాకారులను టీటీడీ పరిషత్ పర్యవేక్షుడు శ్రీనివాసులు సత్కరించారు.
కార్యక్రమంలో కో ఆర్డినేటర్ కృష్ణమూర్తి, మండపం కాంట్రాక్టర్ రఘువీర్ పాల్గొన్నారు. వరంగల్ స్టేషన్‌రోడ్‌లోని కాశీవిశ్వేశ్వరాలయంలో ఆలయ వారసత్వ ట్రస్టీ ఆకారపు హరీశ్, స్వాతి దంపతులు పాల్గొని విశేష పూజలు, పంచాంబృతాభిషేకాలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు లంకాశివకుమార్ శుభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం భక్తులకు పంచాంగ ప్రతులు పంపిణీ చేశారు. కాశీబుగ్గ ప్రాంతంలో కాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణాన్ని ప్రధానార్చకుడు కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో వంగరి రవి, చిలుపూరి సురేశ్, మిట్టపల్లి సదానందం, వంగరి సమ్మయ్య, సుల్లానా సమ్మక్క, కోల కవిత, కూరపాటి రాజా, మంచాల సృజనా శ్రీనివాస్, గడ్డం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.