హరహర మహాదేవ.. శంభోశంకర.. ఓం నమః శివాయ.. ఇలా ముక్కంటి నామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే భక్తజనంతో శైవక్షేత్రాలన్నీ కిటకిటలాడాయి. వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి ఆలయం, రామప్ప ఆలయం, మడికొండలోని మెట్టు రామలింగేశ్వరస్వామి, కురవి వీరభద్రస్వామి ఆలయం, వరంగల్లోని కాశీవిశ్వేశ్వరాలయాల్లో శివుని దర్శనం కోసంభక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని వేదికపై మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించగా భక్తులు కనులారా వీక్షించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా విద్యుద్దీపకాంతుల్లో ఆలయాలు ధగధగా మెరిసిపోయాయి. అర్ధరాత్రి లింగోద్భవ కాలం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అభిషేకాలు కొనసాగాయి. రాత్రంతా భక్తులు జాగరణ చేస్తూ.. పరమ శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. – నమస్తే నెట్వర్క్
శివనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి ఆలయం, రామప్ప ఆలయం, మడికొండలోని మెట్టు రామలింగేశ్వరస్వామి, కురవి వీరభద్రస్వామి ఆలయం, వరంగల్లోని కాశీవిశ్వేశ్వరాలయాలకు వేకువజాము నుంచే భక్తులు తీరారు. అలాగే భక్తజనంతో కాళేశ్వరం పోటెత్తింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన లక్షలాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి సైకత లింగాలను పసుపు, కుంకుమలతో పూజించారు. గర్భగుడిలోని శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేయగా పలుచోట్ల కోడె మొక్కులు చెల్లించి తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తిలోని క్షీరగిరి క్షేత్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకర్రావు-ఉషాదయాకర్రావు దంపతులు సోమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కురవి భద్రకాళీ సమేత వీరభద్రుడికి రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బంగారుమీసాలు, ముక్కుపుడక, పట్టుచీర సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
– నమస్తే నెట్వర్క్