వరంగల్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పలువురు ఇన్స్పెక్టర్ల విదేశీ యాత్రల వ్యవహారంలో పోలీసు శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి సహకారంతో గతంలో థాయిలాండ్, బ్యాంకాక్, శ్రీలంకకు వెళ్లిన ఐదుగురు ఇన్స్పెక్టర్లకు వరంగల్ పోలీస్ కమిషనర్ చార్జి మెమోలు జారీ చేశారు. ఇదే నిందితుడి ఖర్చులతో ఇలాగే విదేశాలకు వెళ్లడం, నిందితుడు పరారయ్యేందుకు ఆర్థికంగా సహకరించిన మరో ముగ్గురు ఇన్స్పెక్టర్ల వ్యవహారంపైనా విచారణ మొదలైంది. అనైతిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన పోలీసులే ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళ్తే..
గ్రేటర్ వరంగల్‌లో లిక్కర్ వ్యాపారంలో కీలకంగా ఉండే ఆకుతోట శిరీష్‌పై ఇటీవల మహిళను వేధించాడనే కారణంగా కేసు నమోదైంది. ఈ కేసును వేగంగా విచారించి నిందితున్ని అరెస్టు చేయాల్సిన పోలీసులు జాప్యం చేశారు. వారాలపాటు నిందితుడు పరారీలో ఉండేలా కొందరు పోలీసులే సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీపీ తరుణ్‌జోషి తీవ్రంగా స్పందించడంతో కేసు విచారణ వేగవంతమైంది. నిందితుడు శిరీష్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టు జైలుకు పంపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు బెయిల్ వచ్చింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ కేసు గ్రేటర్లో సంచలనం రేపింది. కేసు పూర్వాపరాలను విచారించాలని డీసీపీ స్థాయి అధికారిని పోలీసు కమిషనర్ ఆదేశించారు. పిటిషన్ ఆధారంగా బాధిత మహిళతోపాటు ఇతర మార్గాల్లో పోలీసులు విచారణ చేశారు. నిందితుడికి సహకరించడం, సన్నిహితంగా ఉండడం వంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న పోలీసుల తీరు వెలుగుచూసింది. మహిళ పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, నిందితుడు పరారయ్యేలా ఇద్దరు సహకరించినట్లు తేట్లతెల్లమైంది.
వివరణ ఇవ్వాలని ఆదేశాలు..
నిందితుడు శిరీష్‌తో పలువురు ఇన్స్పెక్టర్లు, ఏసీపీ స్థాయి అధికారులు సన్నిహితంగా వ్యవహరించినట్లు తేలింది. నిందితుడి సాయంతో ఇన్స్పెక్టర్లు గతంలో ఫారిన్ ట్రిప్పులు, వీకెండ్ పార్టీల్లో మునిగితేలేవారని విచారణలో నిర్ధారణైంది. ఇన్స్పెక్టర్లు నిందితుడి సహకారంతో విదేశాలకు వెళ్లడం ఐదేండ్లుగా జరుగుతోందని తేలింది. విచారణలోని అంశాల ఆధారంగా శాయంపేట ఇన్స్పెక్టర్ రమేశ్, మడికొండ సీఐ రవికుమార్, ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్, వీఆర్ ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్, వరంగల్ మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగబాబు, సీఐడీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లకు పోలీసు శాఖ చార్జీ మెమోలు ఇచ్చినట్లు తెలిసింది. మహిళ వేధింపుల కేసులో నిందితుడితో సన్నిహితంగా ఉండడం, గతంలో అతడి సహకారంతోనే విదేశాలకు వెళ్లడం, ఆర్థిక లావాదేవీలు కలిగి ఉండడం వంటి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇన్స్పెక్టర్లు మల్లేశ్, రంజిత్ కుమార్ శ్రీలంకకు, రవికుమార్ బ్యాంకాక్‌కు వెళ్లిన ఆరోపణలపై వివరణ కోరినట్లు తెలిసింది. మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు నాగబాబు, రమేశ్‌కు నిందితుడితో ఆర్థిక లావాదేవీలున్నట్లు గుర్తించి వివరణ అడిగినట్లు తెలిసింది.
ఇంకెందరు..
మహిళపై వేధింపుల కేసులో కొందరు పోలీసు అధికారులే నిందితుడికి సహకరించడంపై పోలీసు శాఖ స్పందించి తీవ్ర చర్యల దిశగా అడుగులు వేస్తున్నది. విదేశీ ప్రయాణాలు, ఆర్థిక సంబంధాలతో పాటు అనైతిక వ్యవహారాలకు సహకరించిన మరికొందరు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లపైనా విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులో ఈ కేసుకు సంబంధం ఉన్నట్లు విచారణ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. పిటిషన్ దాఖలు చేసిన మహిళతో రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు పరకాల ఏసీపీ శివరామయ్యపై ఆరోపణలున్నాయి. బాధిత మహిళను హంటర్‌రోడ్డులోని ఓ షాపు వద్దకు పిలిపించి డబ్బులు ఇస్తామని, పిటిషన్ వాపసు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారనే కోణంలో ఈయనపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది. నిందితుడు పరారీలో ఉండేలా సహకరించారని మట్టెవాడలో పనిచేసిన ఓ ఇన్స్పెక్టర్పై ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పరకాల డివిజన్లో ఉన్న ఈ ఇన్స్పెక్టర్.. రోజుల తరబడి పోలీసులకు ఆచూకీ దొరకకుండా ఎలా వ్యవహరించాలో నిందితుడికి సాంకేతికంగా సాయం చేశారనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. నిందితుడి అరెస్టు కోసం పోలీసులు ఎలాంటి వ్యూహాలను అమలుచేసేది ఈ ఇన్స్పెక్టర్ సమాచారం చేరవేసినట్లు ఆరోపణలున్నాయి. నిందితుడి పుట్టిన రోజుల సందర్భంగా, జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇచ్చిన విందులకు హాజరైన వారి వివరాలను పోలీసు ఉన్నతాధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. మహిళపై వేధింపుల కేసులో ఆరుగురు ఇన్స్పెక్టర్లకు చార్జి మెమోలు ఇవ్వడం ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. చార్జీమెమోలు అందుకున్న వారితో పాటు పలువురు సీఐలు, ఒక ఏసీపీపై ఎలాంటి చర్యలు లేకపోవడంపైనా చర్చ జరుగుతోంది.