కాశీబుగ్గ, ఫిబ్రవరి 13 : వరంగల్ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మేడారం వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో ఆర్టీసీ బస్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం పండ్ల మార్కెట్లో ఏర్పాటు చేసిన బస్ పాయింట్ వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కౌంటర్లో మొదటి టికెట్ తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేడారంలో నిర్వహించే సమ్మక్క-సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్దదన్నారు. ఆ తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలోనే మేడారంలో శాశ్వాత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా 5 బస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 360 బస్సులను కేటాయించామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతాకుల అనిల్, గుండేటి నరేంద్రకుమార్, సోమిశెట్టి ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, ఆర్టీసీ డీఎం మోహన్‌రావు, సిబ్బంది కస్తూరి శ్రీనివాస్, ఎస్కే యాకూబ్‌పాషా, శివ తదితరులు పాల్గొన్నారు.