హనుమకొండ, డిసెంబర్ 17: జిల్లాలో నేడు, రేపు పర్యటించనున్న నోబెల్ ప్రైజ్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్థి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. ఆయన పర్యటన సందర్భంగా శనివారం సాయంత్రం కలెక్టర్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైలాష్ సత్యార్థి నేడు ఆదాలత్ కోర్టు సందర్శన, రేపు (19న) హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 50వేల మంది పాఠశాల విద్యార్థులతో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలా నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 8,9,10 తరగతుల విద్యార్థులు హాజరయ్యే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కళాశాల మైదానంలో వేదిక, బారికేడ్లు, బయటకు, లోనికి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలన్నారు. బందోబస్తు ఏర్పా ట్లు చేయాలని పోలీస్ శాఖకు, మైదానం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారు లకు, కరంటు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన చోట ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలని ప్రదర్శించేలా చూడాలన్నారు. అప్పగించిన బాధ్యతల ను అధికారులు పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ఎ టువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. కలెక్టర్‌తో జిల్లా అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఆర్వో ఎం వాసుచంద్ర, డీఈవోలు అహ్మద్ హై, వాసంతి, కూడా ఈఈ భీమ్రావు ఉన్నారు.
షెడ్యూల్
18వ తేదీ (నేడు) ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు నిట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 3గంటల వరకు రెస్ట్ తీసుకున్న తర్వాత 3 నుంచి 6గంటల వరకు అదాలత్ సెంటర్లోని కోర్టును చీఫ్ జస్టిస్‌తో కలిసి సందర్శిస్తారు. రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్‌తో కలిసి నిట్ గెస్ట్‌హౌస్‌లో భోజనం చేస్తారు. 19న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 50 వేల మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఒంటిగంట నుంచి 2గంటల వరకు భోజనం చేస్తారు. అనతరం 2.30గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.