నయీంనగర్, డిసెంబర్ 17 : నిట్‌లో రెండో రోజూ టెక్నోజియాన్ జోరుగా సాగింది. కొంగొత్త ఆలోచనలతో ఆకట్టుకునే ఈవెంట్లు చేసి ఔరా అనిపించగా, ఆటాపాటలు, ఫ్యాషన్‌షోలో పాల్గొన్న కుర్రకారు హుషారుతో ఊగిపోయింది. వీటిని తిలకించేందుకు తరలివచ్చిన విద్యార్థులతో ప్రాంగణమంతా సందడిగా మారింది. ‘కష్టంతో కాదు.. ఇష్టంతో చదివి తమలోని టాలెంట్‌ను సమాజం మెచ్చుకునేలా చేస్తామని.. ఆకాశమే హద్దుగా దూసుకుపోతామని చెప్పుకొచ్చారు.
వరంగల్ నిట్‌లో విద్యార్థులు ఫుల్‌జోష్‌లో మునిగిపోయారు. రెండో రోజు టెక్నోజియాన్‌ను విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేశారు. పలు ఈవెంట్ల ద్వారా తమ ప్రతిభ చాటారు. వీటిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్య తరలిరావడంతో నిట్ కళకళలాడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కంప్యూటర్ కోడింగ్ లెర్నింగ్ ఫ్లాట్‌ఫారం గీక్ ఫర్గీక్స్ వ్యవస్థాపకుడు సందీప్ జైన్ హాజరై కొత్త నిబంధనలు, భాషలను నేర్చుకోవడంతో పాటు వాటి ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ఏ విధంగా విజయం సాధించాలి?, చదువుకునే సమయంలో కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారిలో మరింత జోష్ పెంచారు. ఈ సందర్భంగా తాము కూడా ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటామని చెప్పుకొచ్చారు. తమలో ఉన్న టాలెంట్‌ను బయటికి తీసి సమాజం మెచ్చుకునేలా చేస్తామని మరికొందరు తమ అభిప్రాయాలను మిగతా స్నేహితులతో పంచుకున్నారు. అనంతరం ఆయనను స్టూడెంట్ ఫ్యాకల్టీ డీన్ పులి రవికుమార్‌తో పాటు పలువురు జ్ఞాపిక అందచేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
బోట్ రేస్
నిట్ ఈసీసీ విద్యార్థులు బోట్ రేస్‌ను తయారు చేశారు. ఇందులో నీటిలో ఒక ట్రాక్‌ను ఏర్పాటు చేసి, మధ్యలో జంక్షన్లతో పాటు బ్రిక్స్ వేశారు. ఒకరికి మూడు సార్లు అవకాశం ఇస్తారు. తక్కువ సమయంలో మొదటి నుంచి చివరి వరకు ఎవరి బోటు ముందుకు వెళ్తుందో వారే విన్నర్.
ఉత్సాహంగా ప్రో షో
నిట్ స్టేడియంలో రాత్రివేళ ప్రోషోలు ఉత్సాహం నింపింది. ఈ షోకు ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ సింగర్ యాజీన్ నిజార్, చాట్బ్యాండ్ చాయ్మెట్ టోస్ట్‌లు విద్యార్థులను ఉర్రూతలూగించారు. వారు పాడిన పాటలకు విద్యార్థులు ఎగిరి గంతేశారు. వారు పాడుతున్న పాటలకు విద్యార్థులు సైతం పాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.