ములుగుటౌన్, డిసెంబర్ 17 : భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఈ నెల 28న రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య అధికారులు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ఏఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్ కేకన్, డీఆర్వో రమాదేవితో కలిసి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రామప్పలో మూడు హెలీప్యాడ్లు వీ ఆకారంలో ల్యాండ్ అయ్యేవిధంగా మైదానాన్ని చదును చేయించాలన్నారు. చెట్లు తొలగించాలని, మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేయాలని, ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు.
పారింగ్ ఏరియాలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, బైరవ దేవాలయం, ఉపాలయాలు గర్భగుడిని విద్యుత్ కాంతులతో అలంకరించాలన్నారు. చెరువు కట్టపై పిచ్చి మొకలు తొలగించి శుభ్రంగా ఉండాలన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఎస్పీకి చర్చించారు. ఈ సమావేశంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కో ఆర్డినేటర్ పాండురంగారావు, కలెక్టరేట్ ఏవో విజయభాసర్, హెరిటేజ్ ఏడీ మల్లూనాయక్, పర్యాటక శాఖ అధికారి శివాజీ, డీపీవో వెంకయ్య, జడ్పీసీఈవో ప్రసన్నారాణి, ఇరిగేషన్ ఈఈ వెంకట కృష్ణారావు, పంచాయత్ రాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, ఫైర్ ఆఫీసర్ ఎండి అబ్దుల్ రహీం, డీఆర్డీవో నాగ పద్మజ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, ఏఎస్ఐ మల్లేశం, ఎస్ఏ, ఏఎస్ఐ స్మిత సుకుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ బీ మ ల్సూ ర్, ఈడీ నాగేశ్వర్రావు, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్లు సత్యనారాయణస్వా మి, మంజుల అధికారులు పాల్గొన్నారు.
హెలీప్యాడ్ స్థల పరిశీలన
వెంకటాపూర్, డిసెంబర్ 17: రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఈ నెల 28న రామప్పకు రానున్న నేపథ్యంలో దేవాలయానికి పశ్చిమభాగంలో హెలీప్యాడ్ కోసం ఏఎస్పీ సుధీర్, ఆర్డీవో రమాదేవి స్థలాన్ని పరిశీలించారు. హెలీప్యాడ్ స్థలంలో ఉన్న కరంట్ స్తంభాలు, అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని స్థానిక అధికారులకు సూచించారు. దేవాలయంలో ప్రారంభించనున్న శిలాఫలకం, దర్శనం, తదితర అంశాలను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ రంజిత్ కుమార్, తహసీల్దార్ మంజుల, ఎస్సై తాజొద్దీన్, ఆర్ అండ్ బీ, అటవీ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.