వరంగల్, డిసెంబర్ 17: వరంగల్ మహానగర సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా జీడబ్ల్యూఎంసీ సర్వసభ్య సమావేశం సాగింది. గ్రేటర్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించారు. నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన శనివారం బల్దియా సర్వసభ్య సమావేశం జరిగింది. సుమారు 2 గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై సభ్యులు సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా మిషన్ భగీరథ పనులు, పైపులైన్ల లీకేజీలు, అభివృద్ధి పనుల నత్తనడక, వంగిన విద్యుత్ స్తంభాలు, శ్మశాన వాటికల సమస్యలపై సభ్యులు గళమెత్తారు. అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు పనులు చేపట్టడం లేదని, చేస్తున్న పనులను మధ్యలోనే నిలిపివేస్తున్నారని, నెలలు గడుస్తున్నా పూర్తి చేయడం లేదని పలువురు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. డివిజన్లలో కోతులు, కుక్కలు, పందుల బెడద తీవ్రంగా ఉందని సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. వెంటనే నివారణకు శ్రీకారం చుట్టాలన్నారు. దీనిపై స్పందించిన మేయర్ సుధారాణి సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని, కుక్కలు, కోతులు, పందుల నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని మేయర్ సూచించారు.
ఎజెండా అంశానికి ఆమోదం
అన్నపూర్ణ పథకం కింద రూ. 5 భోజనానికి సంబంధించిన 6 నెలల బిల్లు 1,65,37,000 చెల్లింపు అంశానికి బల్దియా సర్వసభ్య సమావేశం ఆమోదించింది. రూ. 5 భోజన పథకంపై పలువరు కార్పొరేటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. ప్రతి నెలా సుమారు రూ. 28 లక్షలు ఖర్చు చేయడంపై ఒకరిద్దరు కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించక ఆగిపోతున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. మరి కొందరు కార్పొరేటర్లు అన్నపూర్ణ పథకం పేదల కడుపు నింపుతున్నదని, ఇది ఎంతో మంచి పథకమని అభిప్రాయపడ్డారు. సమావేశంలో కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. కాగా, బల్దియా సర్వసభ్య సమావేశానికి డజన్ మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. అలాగే, పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు.
నగరంలో మౌలిక వసతులు..
పారదర్శక పాలన అందిస్తూ నగరాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని మేయర్ సుధారాణి అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీస్‌లో వరంగల్ నగరానికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో వరంగల్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. పారదర్శకత, ఆదర్శవంతమైన పాలన అందిస్తూ అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని వివరించారు. నగరంలో నీటి సరఫరాను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. పట్టణప్రగతి నిధులు ప్రతి నెలా విడుదల చేయడంతో విలీన గ్రామాలతోపాటు నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గ్రీన్ బడ్జెట్‌తో పచ్చని నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రకృతి వనాలు, నర్సరీలు, పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. జనరల్ ఫండ్, స్మార్ట్‌సిటీ, కార్పొరేషన్ సాధారణ నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అనేక అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందింలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.