మామిడిలో పూతదశలో చీడపీడల నివారణకు వేర్వేరుగా మందులు పిచికారీ చేయడం ఖర్చు, శ్రమ తో కూడిన పని. ఒకటి లేదా రెండు సార్లు తోటల పరిస్థితిని బట్టి మందులు చల్లుకుంటే సరిపోతుంది. పూత పూర్తిగా విచ్చుకున్న తర్వాత తెల్లపూత దశలో ఎటువంటి మందులు పిచికారీ చేయొద్దు. పరాగ సంపర్కం అయిన తర్వాత చిన్న పిందెలు ఏర్పడే దశలో తేనే మంచు పురుగు కానీ బూడిద తెగులు లేదా పక్షికన్ను తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు చెట్టు తడిసే విధంగా మందులు పిచికారీ చేస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా 16వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్, కురవి, దంతాలపల్లి, మరిపెడ, తొర్రూరు మండలాల్లో చెట్లు ఉన్నాయి.
పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాధారం మెట్ట సాగులో ఉన్న మామిడి తోటలో పిందె రాలకుండా ఉండేందుకు రైతులు లీటర్ నీటికి 19-19-19 సూక్ష్మపోషకాలు 3 గ్రాములు, 0.25 ఎంఎల్ ప్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. 20 రోజుల వ్యవధిలో 5 గ్రాముల 13-0-45, యూరియా 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. పిందె బఠాణి గింజ సైజులో ఉన్నప్పుడు, బాదంకాయ సైజుకు, నిమ్మకాయ సైజుకు వచ్చిన సమయంలో నీటి తడులు అందించాలి. మామిడి కాయ గోలి సైజు వచ్చిన సమయంలో మామిడి చెట్టుకు అరకిలో యూరియా, కిలో పొటాష్ వేసి నీరందించాలి. దీంతో కాయ సైజు పెద్దగా కావడంతోపాటు పిందె రాలిపోకుండా ఉంటుంది. బిందు సేద్యం సదుపాయం ఉన్న రైతులు రోజుకు రెండు లైన్లలో డ్రిప్‌లో 3నుంచి 5 రోజుల వ్యవధిలో 19-19-19 సూక్ష్మపోషకాలు 3 గ్రాము లు, 0.25 ఎంఎల్ ప్లానోఫిక్స్ ఫైర్టిలైజర్ ట్యాంకులో మందులు కలిపితే వాతావరణం చల్లబడి పిందె రాలుడు తగ్గుతుంది. ఏదైనా సమస్య ఉంటే తమను సంప్రదిస్తే సలహాలు, సూచనలు అందిస్తామని ఉద్యాన శాఖాధికారి రాకేశ్ తెలిపారు.
పూత దశలో..
మామిడి చెట్టుకు పూత దశలో రైతులు విచ్చలవిడిగా మందులు పిచికారీ చేయొద్దు. ఇమిడాక్లోప్రిడ్ 0.3 ఎంల్, కార్బండిజమ్, మాంకోజెబ్ 2 గ్రాములు, 0.5 గ్రాముల శాండోవిట్ కలిపి పిచికారీ చేయాలి.