పోలీస్ కొలువు సాధించాలనే పట్టుదలతో యువతీయువకులు మైదానాల్లో కఠోర సాధన చేస్తున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులై త్వరలో నిర్వహించే ఫిజికల్ ఈవెంట్స్‌లో నెగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెల్లవారుజామునే గ్రౌండ్లకు చేరుకొని కోచ్ పర్యవేక్షణలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆరు చోట్ల ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. పది రోజులుగా కేయూ, సుబేదారి ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల మైదానాలు అభ్యర్థులతో కోలాహలంగా కనిపిస్తున్నాయి.
– సుబేదారి, నవంబర్ 21
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి, ప్రాథమిక పరీక్ష(ప్రిలిమినరీ) నిర్వహించి ఫలితాలను కూడా వెల్లడించింది. ఇక ఫిజికల్ ఈవెంట్స్ కూడా కొద్ది రోజుల్లో నిర్వహిస్తారనే సంకేతాలు కూడా వచ్చాయి. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు నిర్వహించే దేహదారుఢ్య పరీక్షల కోసం కేయూ క్రీడా మైదానాన్ని రాష్ట్ర పోలీసు నిపుణుల బృందం పరిశీలించి, చేయాల్సిన ఏర్పాట్లపై కమిషనరేట్ అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు పోలీసు అధికారులు ఈవెంట్స్ నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. హనుమకొండ కేయూసీ మైదానం, పరకాల, జనగామ, నర్సంపేట సహా మరో రెండు చోట్ల కలిపి మొత్తం 26వేల మందికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కేయూ క్రీడా మైదానంలో ఉచిత శిక్షణ తరగతులను సీపీ తరుణ్‌జోషి ప్రారంభించారు. ఒక ఏసీపీ, ముగ్గురు ఎస్సైలు, 18మంది కానిస్టేబుళ్లు ఉదయం గ్రూప్‌ల వారీగా తర్ఫీదు ఇస్తున్నారు. శిక్షణ కోసం అభ్యర్థులు ప్రిలిమినరీ అర్హత పత్రంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఆరోగ్యజాగ్రత్తలు తప్పనిసరి
అభ్యర్థులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా, గుండె సమస్య ఉన్న వారు డాక్టర్ సలహా తీసుకోవాలి. రన్నింగ్, జంపింగ్ చేయడం వల్ల గుండె వేగం పెరుగుతుంది. రన్నింగ్ అనేది ఒకేసారి కాకుండా క్రమంగా రోజురోజుకూ పెంచుకుంటూ పోవాలి. దీని వల్ల శరీరం ఒత్తిడిని తట్టుకుంటుంది. ఒకేసారి ఎక్కువగా పరుగెత్తితే గుండె వేగం పెరిగి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. మెడిటేషన్ వల్ల శ్వాస ఇబ్బంది ఉండదు. ఒత్తిడిని తట్టుకుంటాం. ఇక ఫుడ్ విషయంలో సిజనల్ ఫ్రూట్స్, పాలు ఎక్కువ తీసుకోవాలి. నూనెలు, మసాలాలకు దూరంగా ఉండాలి. బాడీ డీహైడ్రేషన్ కాకుండా నీళ్లు, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు తప్పనిసరిగా 6నుంచి 8గంటలు నిద్రపోవాలి.
– ఎం.పవన్‌కుమార్, ఎండీ జనరల్ మెడిసిన్, ఎంజీఎం
రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి
పోలీసు ఉద్యోగ నియామకాల్లో మెంటల్‌గా ఎంతైతే బలంగా ఉంటారో ఫిజికల్‌గా అంతే దృఢంగా ఉండడం తప్పనిసరి. ఈ రెండూ ఉంటేనే పోలీసు కొలువు సులుభంగా సాధించవచ్చు. అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్‌లో రాణించేందుకు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. రన్నింగ్‌లో రాణించడం చాలా ముఖ్యం. ముందునుంచే ప్రాక్టీస్ చేయాలి. బాడీ ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామం చేయాలి. వీలైనంత వరకు ట్రైనర్ సమక్షంలో శిక్షణ తీసుకోవాలి. పట్టుదలతో, ఏకాగ్రత్తగా సాధన చేయాలి. కొద్ది రోజులు వాట్సాప్‌కు దూరంగా ఉండి, మంచి ఫుడ్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవాలి. వరంగల్ పోలీసు కమిషనరేట్ నుంచి సుశిక్షితులైన వారితో ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– తరుణ్‌జోషి, సీపీ
ఈసారి మిస్ అవను..
నేను హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. నాకు పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉంది. అందుకోసం నా జాబ్ వదిలేశాను. ఎస్సై జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. పోయినసారి 1.5 మార్కులతో మిస్ అయింది.
– బీ రాజు, ఎస్సై అభ్యర్థి, ధర్మసాగర్
కుటుంబానికి అండగా ఉంటా..
నాన్న లేడు. ఇద్దరు అక్కలు, ఒక అన్న, అమ్మ కూలీ పనిచేసి కష్టపడి డిగ్రీ వరకు చదివించింది. తప్పకుండా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి మా కుటుంబానికి అండగా ఉంటా.
– పీ శిరీష, కానిస్టేబుల్ అభ్యర్థి మరిపెడ
తప్పకుండా సాధిస్తా
నేను డిగ్రీ చదివాను. ఎస్సై కావాలన్నదే నా కోరిక. జాబ్ సాధించి అమ్మనాన్న పేరు నిలబెడుతా. ప్రతిరోజూ కేయూ మైదానంలో పోలీసులు ఇస్తున్న ఫ్రీ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుంటున్నా. తప్పనిసరిగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది.
– బీ మౌనిక, ఎస్సై అభ్యర్థి, గోవిందరావుపేట