రాయపర్తి, నవంబర్ 21 : మత్స్యసంపద వృద్ధి, వ్యాపారంలో విశేష పురోగతి సాధిస్తున్న వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి జాతీయ అవార్డు దక్కింది. సోమవారం ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని డయ్యూడామన్లో మైలారం గ్రామ మత్స్యపారిశ్రామిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోయిని కుమారస్వామికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఆ రాష్ట్ర ఐఏఎస్ అధికారుల బృందం, ప్రజాప్రతినిధుల సమక్షంలో రూ.2 లక్షల నగదు పారితోషికంతో పాటు అవార్డు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
తమకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడంతో ముదిరాజ్ కుటుంబాలతో పాటు అన్ని గ్రామాల పరిధిలోని మత్స్యకారులంతా ఆనందంతో మురిసిపోతున్నారు. మైలారంలో 200 ముదిరాజ్ కుటుంబాలుండగా ఇక్కడ ఉన్న 500మంది మత్స్య సంబంద వ్యాపారాలు, చేపల పెంపకం, గ్రామంలోని మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను తమ ఆదరువుగా భావిస్తూ జీవనాలు కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో గ్రామంలో 180 సభ్యత్వాలు కలిగిన ముదిరాజ్ సొసైటీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చేప పిల్లల విత్తనాలు, నీలకంఠ రొయ్యలు, రొయ్య పిల్లల విత్తనాలను రిజర్వాయర్లో పెంచుతూ సకాలంలో చేపలు పడుతూ అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. గ్రామంలోని ముదిరాజ్ కులస్థులకు సీఎం కేసీఆర్ సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలను వర్తింపజేయడంతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు అనేక వసతులు, సౌకర్యాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తుండటంతో గ్రామ ముదిరాజ్లంతా మత్స్య సంబంధ వ్యాపారంలో ఆరితేరుతూ కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు.