గీసుగొండ, నవంబర్ 20 : జన్మనిచ్చిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిర్మల చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు చైర్మన్, మరియపురం గ్రామ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, ఆయన సతీమణి నిర్మలాదేవి అన్నారు. మరియపురం గ్రామంలో ఆదివారం ట్రస్టు 7వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలాదేవి పుట్టిన రోజు సందర్భంగా కేక్‌కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బాలిరెడ్డి, నిర్మలాదేవి దంపతుల కుమారుడు అల్లం ప్రవీణ్‌రెడ్డి జ్ఞాపకార్థం సర్పంచ్ తన రెండేళ్ల గౌరవ వేతనం రూ.1.20లక్షలను స్వయం సహాయక సంఘాలకు విరాళంగా చెక్కుల రూపంలో అందించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జన్మనిచ్చిన ఊరు రుణం కొంతైనా తీర్చుకునేందుకు పేదలకు ఆర్థిక చేయూతనందిస్తున్నట్లు వివరించారు. ప్రతి వారం గ్రామంలోని పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తూ మందులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ట్రస్టు ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.