వరంగల్, నవంబర్ 20 : సహకార సంఘాలతో ప్రణాళికా ప్రకారం ఆర్థికాభివృద్ధి సాధ్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కల్పలత సూపర్ బజార్ ఆవరణలో ఆదివారం ముగిసిన 69వ జాతీయ సహకార వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు బాసటగా సహకార సంఘాలు నిలుస్తున్నాయని అన్నారు. సహకార సంఘాలు ప్రస్తుత సమాజంలో చిన్న తరహా బ్యాంకుల మాదిరిగా సేవలందిస్తూ, పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పేర్కొన్నారు. కొత్తగా సహకార సంఘాల ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సహకార సంఘాలను ఏర్పాటు చేసి సభ్యుల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న పలుసంఘాల ప్రతినిధులను ఆయన సన్మానించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కాకతీయ సహకార శిక్షణ కాలేజీ ప్రిన్సిపాల్ యాకూబ్‌నాయక్, హనుమకొండ జిల్లా సహకార అధికారి జీ నాగేశ్వర్రావు, వరంగల్ జిల్లా సహకార అధికారి బీ సంజీవరెడ్డి, విశ్రాంత జీఆర్‌వీ చక్రధర్‌రావు, మేనేజింగ్ డైరెక్టర్ జగన్మోహన్రావు, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, స్నేహలత, స్వర్ణలత, ఉద్యోగులు సుమలత, షఫీ, అహ్మద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.