వరంగల్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లైంగిక దాడులు, ఇతర వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు సత్వర స్వాంతన, న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కేంద్రాలను నెలకొల్పుతోంది. ఇందుకోసం పాత సెంట్రల్ జైలు ఎదుట ఉన్న రంగంపేటలోని మహిళా పోలీసు స్టేషన్ ప్రాంతంలో అర ఎకరం స్థలాన్ని కేటాయించింది. రూ.2.50 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ వారం రోజుల్లో భూమి పూజ చేయనున్నారు. జీ ప్లస్ వన్ పద్ధతిలో 17 గదులు, 20 మంది సమావేశమయ్యేలా హాల్ నిర్మిస్తారు. బాధితులకు వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్, న్యాయ సేవలు, పోలీసు విచారణ కోసం వేర్వేరు గదులు ఉంటాయి. ఈ మేరకు ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, పోలీసు అధికారులు పరిశీలించారు.
మహిళలు, పిల్లల కోసం మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రణాళికను ఆచరణలోకి తెచ్చింది. మహిళలు, పిల్లలకు చట్టపరంగా రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ సపోర్టు సెంటర్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్స్ (భరోసా) కేంద్రానికి ప్రత్యేకంగా భవనాన్ని నిర్మిస్తున్నది. అత్యాధునిక హంగులతో అర ఎకరం విస్తీర్ణంలో భరోసా కొత్త భవనాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కలిసి భరోసా కేంద్రం భవన నిర్మాణానికి వారం రోజుల్లో భూమి పూజ చేయనున్నారు. జెమిని ఎడిబుల్, ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ (సీఎస్ఆర్) కింద అందిస్తున్న రూ.2.50 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాత సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న రంగంపేటలోని మహిళా పోలీసు స్టేషన్ ప్రాంతంలో దాదాపు అర ఎకరం స్థలాన్ని కేటాయించింది. 12 గుంటల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టనున్నారు. జీ ప్లస్ వన్ పద్ధతిలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. 17 గదులు, 20 మంది సమావేశమయ్యేలా హాలుతోపాటు బాధితులకు వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్, న్యాయ సేవలు, పోలీసు విచారణ కోసం వేర్వేరుగా గదులు ఉంటాయి.
లైంగికదాడి, పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే బాధితులకు సత్వర స్వాంతన, న్యాయ సేవలు అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 భరోసా కేంద్రాలు ఉన్నాయి. 2020 జూన్‌లో వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో భరోసా కేంద్రం సేవలు మొదలయ్యాయి. వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలోని భరోసా కేంద్రానికి అత్యాధునిక హంగులతో సొంత భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భరోసా కేంద్రంలో మహిళా ఇన్స్పెక్టర్, సైకాలజిస్టు, సపోర్టు పర్సన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, అకౌంటెంట్, రిసెప్షనిస్టు ఉంటారు. మహిళల రక్షణ ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీటీమ్స్ సేవలు ఈ భవనం నుంచే అందించేలా పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బాధితులకు భరోసా కల్పించే కేంద్రాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వీటికి ఈ పేరు పెట్టింది. లైంగిక దాడులు, ఇతర వేధింపులకు గురైన పిల్లలు, మహిళల మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భరోసా కేంద్రాల్లో సేవల నిర్వహణ తీరు ఉంటుంది. పోలీస్ స్టేషన్‌న్‌లో కేసు నమోదు కాగానే బాధితులను నేరుగా భరోసా కేంద్రానికి పంపిస్తారు. అక్కడ పోలీస్ స్టేషన్ తరహా వాతావరణం ఉండదు. బాధితులకు స్వాంతన కలిగించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. మనోధైర్యం కల్పించేందుకు సైకాలజిస్టు భరోసా కేంద్రంలో ఉంటారు. అన్ని రకాలుగా ధైర్యం చెప్పేలా మరో సపోర్టింగ్ పర్సన్ సేవలు అందిస్తారు. బాధితుల గుర్తింపును ఇతరులకు తెలియకుండా, వారి మానసికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు భరోసా కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. వైద్య సేవలు, పరీక్షల నిర్వహణ భరోసా కేంద్రంలోనే ఉంటుంది. వేగంగా న్యాయ సేవలు అందించేలా భరోసా కేంద్రానికే న్యాయవాదులు అందుబాటులో ఉంటారు. బాధితులు కోరిన ప్రకారం వారికి న్యాయ సేవలు అందిస్తారు.