వర్ధన్నపేట, నవంబర్ 18;ఆసక్తి, కఠోర సాధనతో కరాటేలో పతకాల పంట పండిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులున్నా మొక్కవోని ధైర్యంతో ముందుకు దూసుకుపోతున్నాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నాలుగు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెడల్స్ సాధించాడు. 42 సార్లు జాతీయస్థాయిలో రాణించాడు. డిసెంబర్లో మలేషియాలో జరుగునున్న ఇంటర్నేషనల్ గేమ్స్‌కు ఎంపికయ్యాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రుతండాకు చెందిన గిరిజన కుసుమం భూక్యా రమేశ్.
వర్ధన్నపేట మండలం చంద్రుతండాకు చెందిన భూక్యా రమేశ్ ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. ఏటూరునాగారంలో కరాటే మాస్టర్ మహ్మద్ అబ్బూ వద్ద శిక్షణ తీసుకున్నాడు. అనంతరం జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రమేశ్ ప్రతిభ కనబర్చాడు. ఏ పోటీలో పాల్గొన్నా మొదటి స్థానంలో నిలవడంతో మాస్టర్లు మంచి ప్రోత్సాహాన్ని అందించారు. కనీస వసతులు లేకున్నా గురువుల ప్రోత్సాహంతో నిరంతరం కఠోర సాధన చేస్తూ మంచి శిక్షణ పొందాడు. 4 సార్లు అంతర్జాతీయ పోటీల్లో ప్రత్యర్థులను మట్టి కరిపించి పతకాలు సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలో 2017 సంవత్సరంలో జరిగిన ఇంటర్నేషనల్ గేమ్స్‌లో ఇరాన్ దేశానికి చెందిన పోటీదా రుడిపై ఫైనల్లో గెలిచాడు. దుబాయిలో 2018 మార్చి 5న జరిగిన పోటీల్లో ఫైనల్లో జపాన్‌కు చెందిన క్రీడాకారుడిని మట్టి కరిపించాడు. నేపాల్‌లో 2019 ఏప్రిల్ 23న జరిగిన పోటీల్లో మొదటి స్థానం సాధించడంతో పాటు 2019 నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కెనడా దేశానికి చెందిన క్రీడాకారుడితో పోటీపడి మూడో స్థానం సాధించాడు. 42 సార్లు జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించిన రమేశ్ అంతర్జాతీయస్థాయిలో కూడా రాణిస్తూ ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
వచ్చే డిసెంబర్లో అంతర్జాతీయ పోటీలకు ఎంపిక
వచ్చే డిసెంబర్ 2, 4వ తేదీల్లో మలేషియా దేశంలో జరుగనున్న అంతర్జాతీయ కేఎల్ మేయర్స్ కప్-2022 కరాటే పోటీలకు భూక్యా రమేశ్ ఎంపికయ్యాడు. సుమారు 14 దేశాలకు చెందిన క్రీడాకారులు ఇందులో పాల్గొననున్నారు. ఈ పోటీలకు రమేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇందులో ఐదుగురు యువకులు రమేశ్ శిష్యులే కావడం గమనార్హం. రమేశ్ తండ్రి భూక్యా పాపయ్య మృతి చెందడంతో తల్లి పద్మ కూలీ పనులు చేస్తూ రమేశ్‌కు చేయూతనిచ్చింది. రమేశ్ ప్రస్తుతం వర్ధన్నపేట పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు.
కామన్వెల్త్కు ఎంపికవడమే లక్ష్యం : భూక్యా రమేశ్
2023 సెప్టెంబర్ నెలలో స్పెయిన్ దేశంలో జరుగనున్న కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరఫున పాల్గొనడమే లక్ష్యం. ఇప్పటికే నాలుగు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించడంతో నాకు మంచి ర్యాంకు ఉన్నది. డిసెంబర్లో మలేషియాలో జరిగే పోటీల్లో బంగారు పతకంతో పాటు మరో రెండు పోటీల్లో ఉత్తమంగా రాణిస్తే కామెన్వెల్త్ క్రీడలకు ఎంపికయ్యే క్రీడాకారుల జాబితాలో ఉంటా. అందుకని నిరం తరం సాధన చేస్తున్నా. పోటీలకు ఇతర దేశాలకు వెళ్లడం, ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బందవుతోంది. క్రీడాభిమానులు కొంత ఆర్థికంగా సహకరిస్తే కరాటేలో మరింతగా రాణించి రాష్ర్టానికి, దేశానికి మంచి పేరు తీసుకువస్తా. వచ్చే డిసెంబర్లో మలేషియా వెళ్లేందుకు కూడా దాతలు ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నా.