ఖిలావరంగల్, నవంబర్ 18 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సీజన్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు వివరాలను ప్రతి రోజూ ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు రైతులకు చెల్లింపులు జరగాలన్నారు. గన్నీ బ్యాగులు, పరికరాలను కొనుగోలు కేంద్రాలకు పంపించాలని సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. మిల్లర్లు, ఎఫ్‌సీఐ అధికారులు ధాన్యం కొనుగోలుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, కోట శ్రీవత్స తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతగా వ్యవహరించాలి..
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి జిల్లా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ గోపి అన్నారు. కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సోషల్ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ బాలుర హాస్టళ్లు ఉన్నాయని, వీటిలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. గ్రామాల పిల్లలు నగరానికి వచ్చి చదువుకోవడానికి సుముఖంగా ఉన్నారని, మండలాల్లోని హాస్టళ్లను సిటీకి తీసుకువచ్చేందుకు చొరవ చూపాలని సభ్యులు కలెక్టర్‌ను కోరగా, తల్లిదండ్రుల డిమాండ్ మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సంగెం మండలంలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 85 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా 27 పరిష్కరించామన్నారు. డీసీపీ వెంకటలక్ష్మి, డీటీడీవో జహీరుద్దీన్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నస్వామి, యాదగిరి, విజయ్‌కుమార్, మహేందర్ పాల్గొన్నారు.