నల్లబెల్లి, నవంబర్ 18 : అధైర్య పడొద్దు.. అర్హులైన ప్రతి పోడు రైతుకూ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందిస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని ఈర్యతండా, గోవిందాపూర్ గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పోడు వ్యవసాయంపై ఆధారపడ్డ రైతుల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా 2005కు ముందు నుంచి పోడు చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. సర్వేలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని, పరిష్కారానికి రైతులు మరోమారు ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కోర్టుల్లో కేసులు ఉన్న రైతులు మినహా తిరస్కరణకు గురైన భూముల రైతులు ఆధారాలతో రెండో దఫా దరఖాస్తు చేయాలన్నారు. నియోజకవర్గంలో 22 వేల పైచిలుకు ఎకరాలకు పట్టాలందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి (డీటీడీవో) జహీరుద్దీన్, ఎంపీపీ ఊడుగుల సునీత, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, గొల్లపల్లె, రాంపూర్ గ్రామాల సర్పంచ్‌లు దాసు పూలమ్మ, చింతపట్ల సురేశ్రావు, ఎఫ్ఆర్వో కిరణ్, ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ మంగీలాల్, కార్యదర్శి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య రంగానికి పెద్దపీట..
నర్సంపేట : సీఎం కేసీఆర్ వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలో రెండో ఏఎన్ఎంల రాష్ట్ర స్థాయి మహాసభ పోస్టర్లను టీఆర్‌కేవీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో రెండో ఏఎన్ఎంల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్ కిట్టుతో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. పేదలందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేసిందన్నారు. సబ్ సెంటర్లకూ సొంత భవనాలను నిర్మించిందని తెలిపారు. బీసీ, షుగర్ వ్యాధిగ్రస్తులు పేర్లు నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తున్నదన్నారు. కొల్లూరి లక్ష్మీనారాయణ, పాలడుగుల రమేశ్, అల్లావుద్దీన్, చంద్రకళ, రజిత, రాజకుమారి, కవిత, శైలజ, సుమలత, కోమల తదితరులు పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీపీ, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లా మనోహర్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో మనోహర్‌రెడ్డికి ఎమ్మెల్యే పెద్ది మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులకు అభినందన..
ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే పెద్ది అభినందించారు. ముంబైలో ఇటీవల ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. 14 సంవత్సరాల విభాగంలో సచిన్‌రాజ్ గోల్డ్ మెడల్, సాయితేజ బ్రాంజ్ మెడల్, మురళి సిల్వర్ మెడల్ గెల్చుకున్నాడు. కరాటే మాస్టర్ పోశాల మహేశ్, కౌన్సిలర్ దార్ల రమాదేవి, విద్యార్థుల తల్లిదండ్రులు రాజేందర్, సరస్వతి, సాయి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.