నల్లబెల్లి/నర్సంపేటరూరల్/నెక్కొండ, నవంబర్ 18: విద్యార్థులు సన్మార్గంలో నడిచేందుకు చెకుముకి టాలెంట్ టెస్టులు దోహదం చేస్తాయని మండల నోడల్ అధికారి ఎం రామస్వామి అన్నారు. ప్రభుత్వ సమగ్ర శిక్షా విభాగం సహకారంతో నిర్వహిస్తున్న సైన్స్ సంబురాలు మండలవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నల్లబెల్లిలోని జడ్పీహెచ్ఎస్లో శుక్రవారం టాలెంట్ టెస్టులు నిర్వహించారు. విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా మనిషి మారాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, నర్సంపేట మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చెకుముకి సైన్స్ సంబురాలు ఘనంగా జరిగాయి. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో లక్నేపల్లి బిట్స్ స్కూల్లో పోటీలు నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయులు సంతోష్, రజిత, యాకూబ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. అంతేకాకుండా నెక్కొండ మండలం అప్పల్రావుటపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ టాలెంట్ టెస్ట్ ప్రశ్నపత్రాలు, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి, అభిరుచిని పెంచుకోవాలని చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ మండల కన్వీనర్, హెచ్ఎం బూరుగుపల్లి శ్రవణ్‌కుమార్ సూచించారు. శాస్త్రసాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో వస్తున్న మార్పులు, వర్ధమాన సమాజంలో పరిశోధనలను వివరించడం ద్వారా సైన్స్‌పై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ నెల 22న మండలస్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీంద్రనాథ్, యాకయ్య, భూలక్ష్మి, శ్యామ్‌సుందర్, గోపాలరావు పాల్గొన్నారు.