ములుగుటౌన్, నవంబర్ 16 : జిల్లాలో పోడుభూముల సర్వే 98 శాతం పూర్తయిందని, 22వ తేదీ వరకు గ్రామ సభలను నిర్వహించి అర్హులకు పట్టాలు మంజూరు చేస్తామని కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1952 నుంచి ఉన్న పోడు భూముల సమస్యను పరిషరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని పేర్కొన్నారు.
2005 వరకు సాగులో ఉన్న రైతులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి గూగుల్ మ్యాప్ ద్వారా నిర్ధారణ చేసుకొని పట్టాలు మంజూరు చేస్తామన్నారు. సర్వేపై రైతులు సందేహం వ్యక్తం చేస్తే మళ్లీ సర్వే చేసేందుకు వెనుకాడేది లేదన్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దే ప్రయత్నాలు చేస్తామన్నారు. 2005లో సాగు భూమి ఎంత ఉందో ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయని, గతంలో ఇచ్చిన పట్టాలు పోను మిగిలిన రైతులకు పట్టాలు మంజూరు చేస్తామన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏ ఒక రైతు కూడా నష్టపోకుండా పారదర్శకంగా సర్వే చేసినట్లు కలెక్టర్ వివరించారు. బండారుపల్లి, జాకారం శివార్లలో 1950లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ సుమారు 538 ఎకరాల అటవీ శాఖ భూమిని డీ నోటిఫై చేసి రెవెన్యూ శాఖకు అప్పగించారని తెలిపారు. ప్రస్తుతం ఈ భూముల్లో కలెక్టరేట్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తుండడంతో ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు.
గతంలో వారు రెవెన్యూ శాఖకు అప్పగించిన భూములను నిర్ధారణ చేసేందుకు సర్వే నంబర్ 573/1, 573/2లో రెండు శాఖల ద్వారా ఉమ్మడిగా సర్వే నిర్వహిస్తున్నామని, మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందన్నారు. కలెక్టరేట్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, త్వరలో మంత్రులు ఉన్నతాధికారులతో పనులు ప్రారంభిస్తామన్నారు. ఇందుకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందన్నారు. జిల్లా కేంద్రంలో కొత్త ప్రెస్‌క్లబ్ కోసం బండారుపల్లి రోడ్‌లోని పాత ఎంపీడీవో కార్యాలయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. జాకారం గ్రామంలో జాతీయ రహదారికి ఇరువైపులా 1,154 ఎకరాల భూమికి హద్దుల ఏర్పాటుతోపాటు కందకాల తవ్వకం పూర్తయిందని కలెక్టర్ వివరించారు. గిరిజన యూనివర్సిటీకి కేటాయించిన భూమిలో సైతం కందకాల నిర్మాణాన్ని పూర్తిచేసి హద్దులు నిర్ణయించామన్నారు.
గట్టమ్మ దేవాలయం నుంచి మహమ్మద్ గౌస్ పల్లె వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇప్పటికే ప్యాచ్ వర్క్ సైతం పూర్తి చేసినట్లు తెలిపారు. అధిక వర్షాలతో ఏటూరునాగారం, బ్రాహ్మణపల్లి, జగనాన్నాథపురం, ఎదిర ప్రాంతాల్లో జాతీయ రహదారి దెబ్బతిన్నదని, మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పస్రా-తాడ్వాయి మధ్యలో 130 మీటర్ల జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని, జలగలంచ బ్రిడ్జి, కొండపర్తి వద్ద శాశ్వత ప్రాతిపదికన సీసీతో నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు.
పస్రా – మేడారం, తాడ్వాయి – మేడారం రోడ్లలో కూడా మరమ్మతు పనులను చేపడతామన్నారు. ములుగు మండలం ఇంచర్ల సమీపంలో ఉద్యానవన శాఖకు చెందిన ప్రభుత్వ భూమిని పర్యాటక శాఖకు కేటాయించామని, అందులో ట్రైబల్ విలేజ్ నిర్మాణ పనులను ఆ శాఖ ద్వారా చేపట్టి త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు కలెక్టర్ పేరొన్నారు. బండారుపల్లిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే విషయం తమ దృష్టిలో ఉందని, సర్వే నిర్వహించి స్వాధీనం చేసుకుంటామన్నారు. వచ్చే నెలలో డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు కానున్నట్లు వివరించారు. సమావేశంలో డీపీఆర్వో రఫిక్, అధికారులు పాల్గొన్నారు.