నయీంనగర్, నవంబర్ 16 : కేయూలో ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. వర్సిటీ క్రీడా ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను వీసీ ప్రొఫెసర్ రమేశ్ ప్రారంభించారు. పోటీలకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని 38 కళాశాలల నుంచి 300మంది క్రీడాకారులు పాల్గొంటుండగా తొలిరోజు బుధవారం నిర్వహించిన పరుగుపందెం, షాట్‌పుట్, లాంగ్‌జంప్, డిస్కస్‌త్రో విభాగాల్లో పలువురు సత్తాచాటారు.
మొదటిరోజు క్రీడాకారులు తమ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. పరుగుపందెం పోటీల్లో చిరుతల్లా పరుగెత్తుతూ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. హోరాహోరీగా సాగిన పరుగుపందెం పోటీల్లో పలువురు సత్తాచాటారు. బుధవారం పరుగుపందెం పోటీల విజేతలను ప్రకటించగా, గురువారం షాట్‌పుట్, లాంగ్‌జంప్, డిస్కస్‌త్రో పోటీల విజేతలను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా వీసీ రమేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం ఎంతో అవసరమన్నారు. విశ్వవిద్యాలయ పేరుప్రతిష్టలు పెంచేలా ప్రతి విద్యార్థి కృషిచేయాలని ఆయన కోరారు.
కేయూలో ఇంటర్ కాలేజియేట్ పోటీలు గురువారం ముగియనున్నాయి. పలు విభాగాల్లో సత్తాచాటిన విజేతలకు పతకాలు అందించనున్నారు. కార్యక్రమంలో క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ బి.సురేశ్‌లాల్, సవితా జ్యోత్స్న, వి.రమేశ్‌రెడ్డి, జి.సునీల్‌రెడ్డి, ఎస్.కుమారస్వామి, రవి, సురేందర్, వెంకన్న, సోమన్న, రవీందర్, కిరణ్‌కుమార్, పి.భాసర్, టి.శ్రీదేవి పాల్గొన్నారు.