పరకాల, నవంబర్ 6: రాష్ట్రంలో మతతత్వ పార్టీలకు స్థానం లేదని, ప్రజలు ఆ పార్టీలను తరిమికొట్టాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, సంగెం మండలాలకు చెందిన 39 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఆదివారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దీంతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
ఎనిమిదేండ్లలో రాష్ర్టాన్ని దేశానికే మార్గదర్శకంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. దేశంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. కానీ, రాష్ట్రంలో మతతత్వ పార్టీలకు చెందిన కొందరు నాయకులు ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతోచిచ్చుపెట్టి, పబ్బం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. ఆ పార్టీలను ప్రజలు ముందుచూపుతో రాష్ట్రం నుంచి తరిమివేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)నాయకులు పాల్గొన్నారు.