వరంగల్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబురం అంబరాన్నంటింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం నయాజోష్ నింపింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాయకులు రోడ్లపైకి వచ్చి పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాల్లో మునిగితేలారు. అనంతరం డీజే మోత, డప్పుచప్పుళ్ల నడుమ ర్యాలీలు తీసి, ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆనందాన్ని పంచుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రాలు, పట్టణాలు సహా ఊరూవాడన ‘కేసీఆర్ జిందాబాద్.. ‘టీఆర్ఎస్ జిందాబాద్’ నినాదాలతో హోరెత్తించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి విజయం చేకూర్చడంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులందరూ కీలక పాత్ర పోషించి ఇంతటి మెజార్టీ వచ్చేందుకు కృషిచేశారని.. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దేనని ఈ సందర్భంగా పలువురు నేతలు వ్యాఖ్యానించారు.