తొర్రూరు/పెద్దవంగర/దేవరుప్పుల, నవంబర్ 5 : తెలంగాణలో రైతుల నీటి కష్టాలు, ఇబ్బందులను గ్రహించి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చారని, కాళేశ్వరమే లేకుంటే ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడేటోళ్లమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరు, పెద్దవంగర, దేవరుప్పులలో శనివారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పండుగ వాతావరణంలో ప్రారంభించగా పెద్దవంగరలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఆయాచోట్ల మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం బాధ్యతను రాష్ట్రమే మోస్తున్నదని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని, పండిన ప్రతి గింజను కొంటామని అభయమిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే తెలంగాణ నేడు అన్నపూర్ణగా మారిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. పెద్దవంగరలో ఆయన పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని, లోట్లబండ తండా జీపీలో మంత్రి సత్యవతిరాథోడ్‌తో కలిసి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం కోనసీమను మరిపించేలా మారిందన్నారు. నాడు కరువుతో అల్లాడిన ప్రాంతాల్లోనూ నేడు ధాన్య రాశులు పండుతున్నాయన్నారు. రైతుల కు సహకరించకుండా కేంద్రం కిరికిరి పెడుతున్నదని విమర్శించారు. తన గొంతులో ప్రాణముండగా వ్యవసాయ బా వులు, బోర్ల వద్ద మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమం, అభివృద్ధి శూన్యమని, తెలంగాణకు ఎలాంటి సాయం చేయని కేంద్రంలోని బీజేపీకి, ఈ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు లేదని తెగేసి చెప్పారు.
దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, పంట మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేసి నేరుగా ఎఫ్‌సీఐకి పంపుతున్న ఏకైక ప్రభు త్వం తెలంగాణదేనన్నారు. పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో తెలంగాణ సమీప రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మన ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని గుర్తుచేశారు. ‘రాష్ట్రంలో లట్టుగాడు.. పొట్టుగాడు వచ్చి వరి వేయిమన్నారు. తీరా వరి పండేసరికి చేతులెత్తేసిండ్రు. చేసేది లేక రైతులు నష్టపోవద్దని మళ్లీ సీఎం కేసీఆరే ఏటా రూ.వేల కోట్లు కేటాయించి ధాన్యం కొనుగోళ్లు చేయిస్తున్నరు’ అని వెల్లడించారు. మునుగోడు ఎన్నికలో బీజేపీ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టారని, అక్కడ టీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమం కోసం నాడు సీఎం ఎన్టీఆర్ కృషి చేస్తే, నేడు సీఎం కేసీఆర్ మాత్రమే పాటు పడుతున్నారని చెప్పారు. మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తానన్నారు.
దళారీ వ్యవస్థకు మంగళం
తొర్రూరు మండలం ఖానాపురంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించి మాట్లాడుతూ ఈ సీజన్లో రాష్ట్రంలో కోటీ 50లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం 6,713 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. దళారీ వ్యవస్థకు మంగళంపాడి రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న సంకల్పంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి పండిన పంటను కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా యూరియా ధర కూడా విపరీతంగా పెరిగిందని, కేంద్రం ప్రజలపై మోయలేని ధరల భారాన్ని మోపుతున్నదని మండిపడ్డారు. ఒక్క ఖానాపురం వంటి చిన్న గ్రామంలోనే 430మంది రైతులకు రైతుబంధు, 201మందికి పింఛన్లు అందుతున్నాయని, ఐదుగురికి రైతుబీమా, 36మందికి కల్యాణలక్ష్మి వచ్చిందని చెప్పారు.
మహబూబాబాద్ జిల్లాలో లక్షా 83వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేశామన్నారు. ధాన్యం రవాణా కోసం గూడూరు మినహా అన్ని ప్రాంతాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో పీడీ సన్యాసయ్య, ఆర్డీవో ఎల్ రమేశ్, ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి, తహసీల్దార్ రమేశ్‌బాబు, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, డీపీఎం నళినినారాయణ, డీఏవో ఛత్రునాయక్, డీఎస్వో నర్సింగరావు, డీఎస్డీఎం కృష్ణవేణి, డీసీవో ఖుర్షీద్, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్, మండల ప్రత్యేకాధికారి ఖుర్షీద్, ఏపీడీ వెంకట్, ఏపీఎం నరేంద్ర, తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, రాష్ట్ర ఈజీఎస్ బోర్డు డైరెక్టర్ లింగాల వెంకటనారాయణగౌడ్, రైతుబంధు సమితి తొర్రూరు మండల కో-ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, ఖానాపురం, అమ్మాపురం సర్పంచులు చెట్టుపల్లి ఉమారాణి, కడెం యాకయ్య, ఎంపీటీసీ డొనుక ఉప్పలయ్య, ఉప సర్పంచ్ చీకటి శ్రీధర్, పీఏసీఎస్ డైరెక్టర్ పాపిరెడ్డి, టీఆర్ఎస్ పెద్దవంగర మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ రామచంద్రయ్యశర్మ, జిల్లా, మండల రైతు బంధు సమితి సభ్యులు నెహ్రూనాయక్, సోమనర్సింహారెడ్డి, సోమారెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు యాదగిరిరావు, ఏవో కుమార్‌యాదవ్, సర్పంచ్‌లు లక్ష్మీ, పద్మ, ఎంపీటీసీ శ్రీనివాస్, సుధీర్‌కుమార్, శ్రీనివాస్, వెంకన్న, సుధాకర్, రవి, సోమన్న, రాజుయాదవ్ పాల్గొన్నారు.
తెలంగాణలో స్వయం సమృద్ధి
దేవరుప్పుల మండలం నీర్మాలలో ఐకేపీ, సింగరాజుపల్లిలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జనగామ కలెక్టర్ శివలింగయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ రంగపై ఉన్న అవగాహన వల్లే నేడు తెలంగాణలో స్వయం సమృద్ధి సాధించామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే రూ.30వేల కోట్ల సబ్సిడీ ఇస్తామని అంటే సీఎం కేసీఆర్ తోసి పుచ్చారని, రైతులకు నిరంతరం ఉచిత విద్యుత్ ఇచ్చితీరుతామని స్పష్టం చేసినట్లు చెప్పారు. ప్రజల ఆశీర్వాదం కేసీఆర్‌కు ఉండడం వల్లే రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, మరో దశాబ్దం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లికి మహిళా సంఘాలు నీర్మాలలో ఘనస్వాగతం పలికాయి. డప్పులు, కోలాటంతో కొనుగోలు కేంద్రం వేదిక వరకు తీసుకువెళ్లాయి. ఇక్కడ జనగామ అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో రాంరెడ్డి, సీఈవో వసంత, సివిల్సప్తయీస్ డీఎం సంధ్యారాణి, డీఎస్వో రోజారాణి, అడిషనల్ డీఆర్డీఏ నూరొద్దీన్, ఎంపీపీ బస్వ సావిత్రి, జడ్పీటీసీ పల్లా సుందర్‌రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్‌కుమార్, చందన మండల సమాఖ్య అధ్యక్షురాలు నల్ల ఉమ, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో సురేశ్‌కుమార్, సర్పంచ్‌లు మలిపెద్ది శ్రీనివాసరెడ్డి, గోపాల్‌దాస్ మల్లేశ్, ఎంపీటీసీ మేడ కల్యాణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తీగల దయాకర్ పాల్గొన్నారు.
బీజేపీకి రైతు సంక్షేమం పట్టదు : మంత్రి సత్యవతిరాథోడ్
గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి, మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీజేపీకి రైతు సంక్షేమం పట్టదని, రూ.వందల కోట్లు పెట్టి మోసాలు చేయడమే తెలుసని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో ఎంతో మార్పువస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు.