వరంగల్, నవంబర్ 5: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో వాణిజ్య భవనాల లెక్క తేల్చాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆమె రెవెన్యూ, ఇంజినీరింగ్, హార్టికల్చర్ విభాగాల అధికారులతో సమీక్షించారు. నగరంలో చేపట్టిన కమర్షియల్ గృహాల సర్వేను వేగంగా పూర్తి చేయాలని మేయర్ అధికారులకు సూచించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద హనుమకొండలో నాలుగు, వరంగల్‌లో రెండు స్ట్రెచెస్లో చేపట్టిన సర్వేను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేవించారు. నగరంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను గ్రేటర్ కార్పొరేషన్ అనుమతి లేకుండా నరికితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇటీవల హనుమకొండలో చెట్లు నరికిన వ్యక్తికి రూ. 12,500 జరిమానా విధించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పన్నుల విభాగం అధికారులకు సూచించారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు నెలల మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా పన్నులు వసూలు చేయాలన్నారు. మార్చి 31 నాటికి వందశాతం పన్నులు వసూలు చేయాలన్నారు. నగరంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ రవీందర్‌యాదవ్, ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రషీద్, జోనా, శ్రీనివాస్‌రెడ్డి, సీహెచ్‌వో శ్రీనివాసరావు, డీఎఫ్‌వో శంకర్లింగం, డీఈలు రవికుమార్, ఇష్రత్ జహ పాల్గొన్నారు.