నర్సంపేట, నవంబర్ 5 : ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.30 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 90 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలిపారు. కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించని అనేక రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్వోసీ ద్వారా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దేశంలోనే సీఎం రిలీఫ్ ఫండ్‌ను ఎక్కువ మొత్తంలో ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గం మూడో స్థానంలో ఉందని తెలిపారు. ఇప్పటివరకు రూ.36 కోట్లకు పైగా నగదును లబ్ధిదారులకు అందించామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా ఐక్యంగా ఉండాలి..
రైతులు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా కావాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. క్యాంపు కార్యాలయంలో డివిజన్లోని 37 ఎఫ్‌పీవోలకు యాసంగి, వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన కమీషన్ రూ.58 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2020-21 సంవత్సరంలో 1,82,564 క్వింటాళ్ల ధాన్యాన్ని ఎఫ్‌పీవోలు కొనుగోలు చేశాయన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులు వృద్ధి చెందాలనే ప్రధాన లక్ష్యంతో రూపుదిద్దుకున్న సంఘా లు బ్యాంకుల ద్వారా రుణాలు పొంది లాభాలు గడించడం గర్వకారణమని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని జోడించి సేద్యం చేయాలన్నారు.
డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ చేసే స్థాయికి ఎదగడం సాంకేతికతకు నిదర్శనమన్నారు. ఒక్కో సంఘం బ్యాంకుల నుంచి రూ. 2 కోట్ల రుణం పొందే ఆస్కారం ఉందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఆహారోత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ చేయడం ద్వారా అధిక లాభాలను గడించవచ్చని వివరించారు. రైతు ఉత్పత్తి సంఘాలకు రుణాలను అందించేందుకు నాబార్డ్ సుముఖంగా ఉందని పేర్కొన్నారు. కుటీర పరిశ్రమల ఏర్పాటు, గోడౌన్ల నిర్మాణం కోసం ప్రోత్సాహకాలు లభిస్తాయన్నారు. ఇంకా ఎక్కువ స్థాయిలో ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో జేడీఏ ఉషాదయాళ్, ఏడీఏ అవినాశ్ వర్మ, ఎంపీపీలు మోతె కళావతి, కాట్ల కోమల, ఊడుగుల సునీత, వేములపెల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ సభ్యులు, రైతు బంధు సమితి బాధ్యులు మోతె జైపాల్‌రెడ్డి, కుంచారపు వెంకట్‌రెడ్డి, నామాల సత్యనారాయణ, గుడిపూడి అరుణ తదితరులు పాల్గొన్నారు.