ఖానాపురం, నవంబర్ 5: రైతులు ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ధర్మారావుపేటలో ఏర్పాటు చేసిన ధర్మారావుపేట రైతు ఉత్పత్తి సంఘాన్ని శనివారం పెద్ది ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు, సాగులో అధునాతన విధానాలు ఎంతో అవసరమన్నారు. అందుకు ప్రత్యామ్నాయం రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటేనని చెప్పారు. రైతులు ప్రతి గ్రామంలో రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసుకుని, ఒక్కో గ్రూపులో 300 మంది రైతులకు తక్కువ కాకుండా సభ్యులుగా చేర్చుకోవాలని సూచించారు. రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుతో రైతులే నాణ్యమైన విత్తనాలను తయారు చేసుకునే అవకాశం ఉంటుందని, అదేవిధంగా పంట ఉత్పత్తులకు తానే ధర నిర్ణయించుకునే అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
పంటలను ప్రాసెసింగ్ చేసుకుని విక్రయించుకునే అవకాశం రైతు ఉత్పత్తి సంఘాలు కల్పిస్తాయన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు రైతు ఉత్పత్తి సంఘాలకు వర్థిస్తాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 300 రైతు ఉత్పత్తి సంఘాలు ఉంటే.. ఒక్క నర్సంపేట నియోజకవర్గంలో 100 ఉన్నాయని వివరించారు. అందులో 30 సంఘాలను ప్రారంభించినట్లు తెలిపారు. ధర్మారావుపేట రైతు ఉత్పత్తి సంఘానికి రూ. 2 కోట్ల రుణాలు ఇప్పిస్తానని, అందులో 50 శాతం సబ్సిడీ ఉంటుందని స్పష్టం చేశారు. పోడు భూముల సర్వేను అర్హులైన రైతులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ వెన్ను శ్రుతి, రైతు ఉత్పత్తి సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, కత్తాల వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో అవగాహన పెరుగాలి
నర్సంపేట: విద్యార్థుల్లో సామాజిక, శాస్త్రీయ అవగాహన పెరుగాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పీ భాస్కర్ కోరారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక నిర్వహించే చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్టర్లను పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్‌ల్లో పాల్గొనవచ్చని భాస్కర్ సూచించారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు వేర్వేరుగా పరీక్షలు ఉంటాయన్నారు. పాఠశాల స్థాయిలో ఈ నెల 18, మండల స్థాయిలో 22, జిల్లా స్థాయిలో 27న జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో నాగెల్లి వెంకటనారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి మోతె ఇంద్రసేనారెడ్డి, కుమార్‌రెడ్డి, సుధాకర్, నల్లా భారతి పాల్గొన్నారు. అలాగే, నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న గోడౌన్లలో ఎగుమతులు, దిగుమతులు కొనసాగించాలని కోరుతూ టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు ఎమ్మెల్యేకు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. మార్కెట్‌పై ఆధారపడి 450 మంది కూలీలు జీవనం కొనసాగిస్తున్నారని, అధికారులతో మాట్లాడి గోడౌన్లలో ఎగుమతులు, దిగుమతులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బాధిత కుటుంబాలకు పెద్ది పరామర్శ
నర్సంపేటరూరల్: మండలంలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శనివారం పరామర్శించారు. ముత్తోజిపేటకు చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) సీరియర్ కార్యకర్త రాయిశెట్టి మల్లయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సందర్భంగా మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇటుకాలపల్లికి చెందిన మాతృశ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జమాండ్ల రాజు కూతురు మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని పెద్ది పరామర్శించారు. ఆయన వెంట నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ మొరాల మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, సర్పంచ్‌లు గోలి శ్రీనివాస్‌రెడ్డి, మండల రవీందర్, ఎంపీటీసీ భూక్యా వీరన్న, తాళ్లపెల్లి రాంప్రసాద్, చాంద్‌పాషా, రవి, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.