నల్లబెల్లి, నవంబర్ 1: రైతులు మెళకువలు పాటిస్తూ వరి, పత్తి పంటల్లో ఆశిస్తున్న తెగుళ్ల నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధిస్తారని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. మండలంలోని శనిగరం, రుద్రగూడెంలో మంగళవారం ఆమె పత్తి, వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ వరి పంటలో మెడవిరుపు, దోమకాటు, కంకినల్లి, గింజ మచ్చ తెగులు ఉన్నందున అన్నదాతలు వ్యవసాయాధికారులను సంప్రదించాలన్నారు. వారు సూచించిన పురుగు మందులను పంటలపై పిచికారీ చేస్తే తెగుళ్లను సమూలంగా నివారించొచ్చని వివరించారు.
అనుమతి లేకుండా విక్రయించొద్దు
కంపెనీల అనుమతి పత్రాలు లేని ఎరువుల దుకాణాదారులు పురుగు మందులను విక్రయించొద్దని ఏడీఏ విజయ్చంద్ర సూచించారు. మండలకేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాపుల్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఎరువుల దుకాణం లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. అనుమతి లేకుండా రైతులకు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరుగాలం కష్టపడుతున్న రైతులకు నకిలీ పురుగుల మందులు, ఎరువులు విక్రయిస్తే బాధ్యులైన దుకాణాదారుల లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే, కాలం చెల్లిన మందులు విక్రయించొద్దన్నారు. ఆ మందులను షాపుల్లో నిల్వ ఉంచొద్దని హెచ్చరించారు. ప్రతి వ్యాపారి విధిగా లావాదేవీలను రిజిస్టర్లో, బిల్ బుక్కుల్లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమం లో ఏవో పరమేశ్వర్, ఎన్ఎఫ్ఎస్ఎం సారంగం, ఏఈవోలు సాధన, శ్రీకాంత్ పాల్గొన్నారు.
పంట నష్టం అంచనా..
చెన్నారావుపేట: బోడమాణిక్యంతండా పరిధిలో కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతుల పంట పొలాలను జేడీఏ ఉషాదయాళ్ మంగళవారం పరిశీలించారు. ఎల్లాయగూడెం, చెరువుకొమ్ముతండా, బోడమాణిక్యంతండాలోని రైతులు రాజాగోల్డ్ సీడ్స్ వరి విత్తనాలు సాగు చేశారు. అందులో కల్తీ విత్తనాలు ఉండడంతో గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఉషాదయాళ్ పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు.