పర్వతగిరి, నవంబర్ 1: ప్రజలు అత్యాశకుపోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్ సూచించారు. మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏసీపీ హాజరై మాట్లాడారు. ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు, సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ అడిగితే చెప్పొద్దన్నారు. సైబర్ నేరగాళ్లు ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ఈజీగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు. తమ సెల్ఫోన్లకు అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఉమెన్ సేఫ్టీ, చైల్డ్ మ్యారేజ్, ఆత్మహత్యల నివారణ, డ్రగ్స్ నిషేధం, గుట్కా, గంజాయి, గుడుంబా, గ్యాంబ్లింగ్, ట్రాపిక్ వైలెన్స్, సీసీ టీవీ కెమెరాల వినియోగం తదితర అంశాలపై విద్యార్థినులకు ఏసీపీ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ అనుముల శ్రీనివాస్, పర్వతగిరి ఎస్సై దామెరుప్పుల దేవేందర్, ప్రిన్సిపాల్ వన్నాల మాధవి పాల్గొన్నారు.
ఓటీపీని ఎవరికీ షేర్ చేయొద్దు
నర్సంపేట: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట సీఐ పులి రమేశ్ సూచించారు. నర్సంపేటలోని బిట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంగా సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయని గుర్తుచేశారు. నేరగాళ్లు ప్రజలను పక్కదాని పట్టించేందుకు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రజలకు ఫోన్ చేసి బ్యాంకు అకౌంట్ నంబర్లు, ఓటీపీ, పాస్వర్డ్ అడుగుతున్నారని, వారికి ఎట్టి పరిస్థితిలోనూ చెప్పొద్దని సూచించారు. ఆయా నంబర్లను ఎవరికీ షేర్ చేయొద్దన్నారు. మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై సురేశ్, ప్రిన్సిపాల్ హరిచరణ్, ఏవో సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
నల్లబెల్లి: సైబర్ క్రైమ్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రాజారాం సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ఓ వ్యక్తి ఫేస్బుక్లో వర్క్ ఫ్రం హోం అనే యాడ్‌ను చూసి రిజిస్ట్రేషన్ కోసం యత్నించాడని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 500, ట్రైనింగ్ ఫీజు రూ. 1000, అపాయింట్మెంట్ కోసం మరో రూ. 1000 పంపించాలని కంపెనీ వారు అతడిని అడిగారని తెలిపారు. రెండుసార్లు అతడు రూ. 500 చొప్పున పంపించినట్లు వివరించారు. తర్వాత అతడికి అనుమానం రావడంతో వెంటనే సైబర్ క్రైమ్ టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి విషయం చెప్పాడన్నారు. దీంతో బాధిత వ్యక్తి కోల్పోయిన రూ. వెయ్యిని ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. స్మార్ట్ఫోన్లు వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు ఎస్సై సూచించారు.
1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి
రాయపర్తి/చెన్నారావుపేట: సైబర్ నేరాలపై మండల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఎస్సై బండారి రాజు కోరారు. మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు, ప్రజలు, సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, కళాశాలల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులకు సైబర్ నేరాల నమోదు-సహాయం పొందే విధానాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ ఫోన్ చేసి అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు, లోన్లు, ఉచిత బహుమతులు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల అనుసంధానం, ఓటీపీ చెప్పాలని కోరే వ్యక్తుల మాటలను నమ్మొద్దన్నారు. అలాగే, అపరిచిత, అనుమానిత వ్యక్తులు కొరియర్, పార్శిళ్ల పేరుతో ఇండ్ల వద్దకు వస్తారని, పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే అనుమతించాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. సదస్సులో గురుకుల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్, ఏఎస్సై పల్లంకొండ సదానందం, హెడ్‌కానిస్టేబుళ్లు గరికపాటి సురేశ్రావు, ఏలియా, రవీందర్, నసీం అహ్మద్, సిబ్బంది తూళ్ల సంపత్‌కుమార్, చిదురాల రమేశ్, మహేందర్, బొట్ల రాజు, లక్ష్మణ్, గొళ్లెన రమేశ్, కత్తుల శ్రీనివాస్, పల్లం రాజు, శీలంనేని నర్సింగరావు, బండారి మహేందర్ పాల్గొన్నారు. చెన్నారావుపేటలోని సిద్ధార్థ గురుకుల హైస్కూల్ విద్యార్థులకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు. నెక్కొండ సీఐ హథీరాం పలు అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ఎస్సై తోట మహేందర్, సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.