సుబేదారి, అక్టోబర్ 30 : పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో కమిషనరేట్ ఈస్ట్ జోన్, వెస్ట్‌జోన్ పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పోలీస్స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, విచారణ, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల వెంట నిత్యం పెట్రోలింగ్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టాలన్నారు.
రోడ్డు ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మిస్సింగ్ కేసుల్లో వ్యక్తుల ఆచూకీ కనుగొని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించి నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. కేసుల దర్యాప్తు విషయంలో ఎస్‌వోపీని అనుసరించాలని, నేరస్తులకు శిక్షపడే విధంగా సాక్షాలను సేకరించి కోర్టుకు సమర్పించాలని సూచించారు. నేరస్తులను గుర్తించడానికి కీలకమైన సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమీక్షలో డీసీపీలు వెంకటలక్ష్మి, సీతారాం, ఏసీపీలు నరేశ్‌కుమార్, శివరామయ్య, సంపత్‌రావు, రఘుచందర్, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.