కురవి, అక్టోబర్ 30 : కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో వచ్చే నెల ఒకటి నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రస్థాయి క్రీడా టోర్నమెంట్, ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ గురుకులాల ఆర్సీవో ఏవీ రాజ్యలక్ష్మి తెలిపారు. ఆదివారం ఆమె మండలంలో ఏర్పాటవుతున్న క్రీడామైదానాలను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా స్టేట్ మీట్‌ను కురవిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 23ఈఎంఆర్ఎస్ పాఠశాలల నుంచి 1300మంది బాలబాలికలతోపాటు మరో 200 మంది పాల్గొంటారని, వారికి సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అండర్-14, అండర్-19 విభాగాల్లో వ్యక్తిగత పోటీలు పది, అండర్-19లో ఏడు క్రీడాపోటీలు ఉంటాయన్నారు. ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ క్రీడల్లో గ్రూపు గేమ్స్ జరుగుతాయన్నారు. ఈ క్రీడాపోటీల్లో ఎంపికైన విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న నేషనల్స్‌కు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వీ సరిత, పీడీ వీర్యానాయక్, వైస్ ప్రిన్సిపాల్ భరణి, పీఈటీ జ్యోతి, విజయ, ముత్తయ్య, గణేశ్‌యాదవ్, కిషన్ పాల్గొన్నారు. కాగా, కురవి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో జరిగే స్టేట్ మీట్‌కు సర్వంసిద్ధం చేశారు. క్రీడా మైదాన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని, ఇవి పర్మినెంట్‌గా ఉండనున్నట్లు పీడీ వీర్యానాయక్ తెలిపారు.